ఫ్యాక్ట్ చెక్: వీడియో లో కనిపించే మేఘాలు మనిషి సృష్టించినవి కావు, వీటికీ హరికేన్ మిల్టన్ కూ సంబంధం లేదు
హెలీన్ హరికేన్ నుండి ఇటీవలే ఫ్లోరిడా కోలుకుందని ఆనందించే లోపే మిల్టన్ హరికేన్ తో మరో ఊహించని ముప్పు పొంచి ఉంది.
హెలీన్ హరికేన్ నుండి ఇటీవలే ఫ్లోరిడా కోలుకుందని ఆనందించే లోపే మిల్టన్ హరికేన్ రూపంలో మరో ముప్పు దరి చేరింది. ఇది కేవలం 12 గంటల్లోనే కేటగిరీ 1 నుండి కేటగిరీ 5కి చేరుకుంది. ఈ తరహాలో మార్పు చెందడం చూసి నిపుణులే ఆశ్చర్యపోయారు. ఈ తుఫాను కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఫ్లోరిడా తూర్పు భాగంలో తుఫాను ధాటికి వేలాది గృహాలు ధ్వంసం అయ్యాయి, ఎన్నో టౌన్లు, గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. తుఫాను ధాటికి బేస్ బాల్ స్టేడియం పైకప్పు కూడా ధ్వంసమైంది.
మిల్టన్ హరికేన్ కు కారణాలకు సంబంధించిన వాదనలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. మిల్టన్ హరికేన్ భూమిని సమీపిస్తున్న సమయంలో ఫ్లోరిడాపై జియోఇంజినీరింగ్ మేఘాలను సృష్టించారని పేర్కొంటూ చాలా మంది వినియోగదారులు మేఘాలను చూపించే వీడియోను షేర్ చేస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు HAARP సాంకేతికతను, ప్రభుత్వ అధికారులను నిందిస్తున్నారు.
కొంతమంది వినియోగదారులు “ఈ మేఘాలు మీకు సహజంగా కనిపిస్తున్నాయా? హరికేన్ మిల్టన్ పై జియో ఇంజనీరింగ్ ప్రభావం ఉంది... HAARP వాతావరణ ఆయుధాలను ఉపయోగిస్తోంది." అంటూ పోస్టులు పెట్టారు.
“HAARP Created Hurricane Milton Harris! This is what Geo Engineering looks like!” అనే క్యాప్షన్ తో కూడా వీడియోను షేర్ చేశారు. హార్ప్ వీటిని తయారు చేసిందని వాపోయారు.
అదే మేఘాలను చూపించే విజువల్స్ యూట్యూబ్‌లో కూడా వైరల్ అయ్యాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కనిపించే మేఘాలు మిల్టన్ హరికేన్‌ను సృష్టించిన జియోఇంజనీరింగ్ మేఘాలు కాదు. వీడియో 2021 సంవత్సరం నుండి ఆన్ లైన్ లో ఉంది. ఆస్పెరిటాస్ మేఘాలను చూపుతుంది.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు జూన్ 29, 2021న ప్రచురించిన అదే వీడియోను చూపించే Facebook పోస్ట్ మాకు లభించింది. ఆ పోస్ట్‌లో “ఫ్లోరిడాలోని ఫోర్ట్ వాల్టన్ బీచ్‌పై అద్భుతమైన ఆస్పెరిటాస్ మేఘాలు ఉన్నాయి. ఈ తరంగ ఆకారపు మేఘాలు వర్షపాతాన్ని సృష్టించవు కానీ ఉరుములతో కూడిన తుఫానులతో ముడిపడి ఉంటాయి. క్రెడిట్: రెడ్డిట్ yoyome85” అంటూ పోస్టు ఉంది.
తదుపరి శోధనలో, మేము జూన్ 2021లో ibtimesలో ‘Apocalyptic Scenes in skies stun beachgoers, experts have different explanation’ అనే శీర్షికతో ప్రచురించిన కథనాన్ని కనుగొన్నాము. ఈ మేఘాల గురించి నిపుణుల వివరణ కూడా ఉంది. మేఘాలు ఆస్పెరిటాస్ మేఘాలు అని, ఇది సహజమైనవని నిపుణులు స్పష్టం చేశారు. ఆస్పెరిటాస్ మేఘాలు కఠినమైన సముద్ర ఉపరితలాల లాగా కనిపిస్తాయి. ఇవి వర్షపాతం కలిగించవు. ఈ మేఘాలు తుఫానులను సృష్టించగలవు.
హార్ప్ అంటే హై-ఫ్రీక్వెన్సీ యాక్టివ్ అరోరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేది US సైనిక పరిశోధన కార్యక్రమం. భూమికి చెందిన అయానోస్పియర్‌ను అధ్యయనం చేయడానికి ఉద్దేశించారు. అయానోస్పియర్ అధ్యయనం కోసం ప్రపంచంలోని అత్యంత సామర్థ్యం గల అధిక-శక్తి, అధిక-ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిటర్ ను HAARP ఉపయోగిస్తుంది. శాస్త్రీయ అధ్యయనం కోసం అయానోస్పియర్ పరిమిత ప్రాంతాన్ని తాత్కాలికంగా ఉత్తేజపరిచేందుకు IRIని ఉపయోగించవచ్చు.
చాలా మంది వ్యక్తులు HAARP సాంకేతికతకు వ్యతిరేకంగా వదంతులను కూడా వ్యాప్తి చేస్తున్నారు, ఇది వాతావరణం, ఇతర అంశాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు ఉపయోగిస్తాయనే వాదన కూడా ఉంది. HAARP సాంకేతికత గురించి తప్పుడు సమాచారంపై గతంలో తెలుగుపోస్ట్ ప్రచురించిన ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ ఉంది
రాయిటర్స్‌లో ప్రచురించిన ఒక కథనంలో తుఫానులు ఎలా ఏర్పడతాయి, వాటి మీద ఉన్న రూమర్ల గురించి వివరాలు ఉన్నాయి. కనుక, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. HAARP టెక్నాలజీని ఉపయోగించి అమెరికాలో తుఫానును సృష్టించలేదు.
Claim : USAలోని ఫ్లోరిడాలో HAARP హరికేన్ మిల్టన్ ను సృష్టించింది. ఈ మేఘాలను జియో ఇంజనీరింగ్ ఉపయోగించి తయారు చేశారు
Claimed By : Social media users
Fact Check : False