ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో భవనాలను కూల్చివేసేందుకు వచ్చిన హైడ్రా అధికారులపై ప్రజల దాడి ని చూపడంలేదు
హైడ్రా కూల్చివేతల కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల ప్రజలు టెన్షన్ పడుతూ ఉన్నారు. న్యాయవ్యవస్థతో సహా వివిధ వర్గాల
By - Satya Priya BNUpdate: 2024-10-04 05:23 GMT
హైడ్రా కూల్చివేతల కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల ప్రజలు టెన్షన్ పడుతూ ఉన్నారు. న్యాయవ్యవస్థతో సహా వివిధ వర్గాల ప్రజల నుండి హైడ్రాపై విమర్శలు వస్తున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్‌పురలో ఇటీవల భవనాన్ని కూల్చివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ కె లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన విచారణలో, కూల్చివేత చట్టబద్ధత, విధివిధానాలపై కోర్టు అధికారులను ప్రశ్నించింది. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి అధికారులు వ్యవహరిస్తున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం సాయంత్రం నోటీసులు జారీ చేశామని, ఆదివారం కూల్చివేత జరిగిందని, ఇది ప్రక్రియలోని అవకతవకలను ఎత్తి చూపుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
తమ ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నట్టు ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. అధికారులపై ప్రజలు రాళ్లు రువ్వుతున్నట్లు, ఓ జేసీబీ రోడ్డు మీద వెళుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇది.
తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. వైరల్ వీడియో రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందినదని ధృవీకరించే అనేక కథనాలను మేము కనుగొన్నాము. సెప్టెంబర్ 22, 2024న అప్లోడ్ చేసిన X పోస్ట్ కారణంగా వైరల్ వీడియో రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని రూపన్‌ఘర్‌కు చెందినది అని తెలుసుకున్నాం.
ఇదే వీడియో ను ఇన్స్టాగ్రాం వినియోగదారుడు ఒకరు 'రూపన్‌గఢ్‌లో బాహాటంగా గొడవ పడుతున్న దుండగులు. రూపన్‌గఢ్ ప్రాంతంలో షాపు యాజమాన్య వివాదంపై ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పులు. ఝ్ఛ్భ్ కి నిప్పు అంటించారు. ప్రాంతంలో విస్తృతమైన గొడవల వలన మార్కెట్ మూసివేసారు. ఫ్యాక్షన్ గొడవలో నలుగురికి గాయాలు. హైవే బంజరు భూముల్లో నిర్మించిన దుకాణాలపై వివాదం. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.' అంటూ షేర్ చేసారు.
Rajasthan.ndtv.inలో ప్రచురించిన కథనం ప్రకారం, అజ్మీర్ జిల్లా రూపన్‌గఢ్‌లో ఒక భూ వివాదం చోటు చేసుకుంది. రూపన్‌గర్‌లోని శ్వేతాంబర్ జైన్ సమాజ్ హాస్టల్ స్థలంలో నిర్మిస్తున్న దుకాణాలను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులపై బల్వారం చౌదరి మేనల్లుడి వర్గం దాడి చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైన సమాజ్ గ్రూపునకు చెందిన రూపన్‌గఢ్ ప్రాంతంలోని ఓ స్థలంలో నిర్మాణం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సర్పంచ్ భూమిని అక్రమంగా లీజుకు తీసుకున్నారని ఆరోపిస్తూ ఓ వర్గం నిర్మాణాన్ని వ్యతిరేకించింది. వాగ్వాదం పెరిగి ఇరువర్గాలు కర్రలు, రాడ్‌లతో పరస్పరం దాడి చేసుకున్నారు. కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ గొడవలో పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
గుంపులోని వ్యక్తులు జేసీబీ ని ధ్వంసం చేసి, తగులబెట్టి, మరికొన్ని వాహనాలను ధ్వంసం చేసారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. హింసకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అందువల్ల, వైరల్ వీడియో తెలంగాణకు చెందినది కాదు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించినది కాదు. ఆ వీడియో రాజస్థాన్‌లోని అజ్మీర్‌కి చెందినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : హైదరాబాద్‌లో భవనాలను కూల్చివేసేందుకు వచ్చిన హైడ్రా అధికారులపై ప్రజలు దాడికి దిగారు
Claimed By : Social media users
Fact Check : Misleading