Hyderabad : న్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధం.. ఆంక్షలివే

హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమయింది. పోలీసులు అనేక ఆంక్షలు విధించారు.

Update: 2024-12-31 02:34 GMT

హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమయింది. ఈరోజు రాత్రి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటుండటంతో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. రాత్రి 12 గంటల వరకూ బార్లు, పబ్ లకు అనుమతి ఇచ్చారు. రాత్రి ఒంటి గంట వరకూ వైన్ షాపులకు అనుమతి మంజూరు చేశారు. అయితే పబ్ లలో డ్రగ్స్ వినియోగంపై డేగ కన్నుతో పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. అన్ని పబ్ లపై నిఘాను ఏర్పాటు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. అడుగడుగునా తనిఖీలతో పాటు డ్రెంకన్ డ్రైవ్ టెస్ట్ లను నిర్వహిస్తున్నామని, యువతీ యువకులు తమకు సహకరించాలని పోలీసులు కోరారు.

మద్యం సేవించి వాహనం నడిపితే...
దీంతో పాటు పబ్ లలో మద్యం సేవించిన వారికి ఇంటి వద్దకు డ్రాప్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను వారు చేసుకోవాలని సూచించారు. లేకుంటే భారీ జరిమానాతో పాటు శిక్షలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో డీజే సౌండ్ విషయంలో కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిమితికి మించి శబ్దం బయటకు వినిపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందికలగకుండా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. బయట జరిగే ఈవెంట్లలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పరిమితికి మించిన జనాన్ని పోగు చేయవద్దని కూడా సూచించారు. దీంతో పాటు డ్రగ్స్ వినియోగంపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. పబ్ లకు పదిహేను రోజులు ముందుగానే అనుమతి ఇచ్చారు.
ఫ్లైఓవర్ల మూసివేత...
అలాగే నగరంలోని ఫ్లే ఓవర్లను ఈరోజు రాత్రి నుంచి మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ ఓఆర్ఆర్, ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. వాహనాల రాకపోకలకు అనుమతిని నిరాకరిస్తామన్నారు. అదేసమయంలో కేవలం ఓఆర్ఆర్ లో భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహనాలను కూడా సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బేగంపేట, టోలీ చౌకి మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను నేటి రాత్రి 11 గంటల నుంచి మూసివేయనున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలపై కూడా ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నగరంలోని 172 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. తమకు ప్రజలు సహకరించాలని కోరారు.


Tags:    

Similar News