హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం నుంచే నగరంలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసాయి.
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం నుంచే నగరంలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసాయి. ఉదయం 11 గంటల వరకూ భారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరించింది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కారు మబ్బులు కమ్ముకోవడంతో చీకటిమయంగా మారింది. ఉత్తర, దక్షిన భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణితో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తన ఏర్పడిందని, రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రేపు భారీ వర్షాలు....
రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు వికారాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురిసాయి. హైదరాబాద్ లోని ప్రజలు వర్షం అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడిప్పుడే మూసీ వరద శాంతించడంతో కొంత పరిస్థితి మెరుగుపడింది. అయితే మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో నగరవాసులు తల్లడిల్లిపోతున్నారు.