Vegetable Prices : కొనలేక పోతున్న కూరగాయలు.. మాసం ధరలే మేలట..!
కూరగాయల ధరలు పెరిగిపోయాయి. కొనలేనంతగా ధరలు పెరిగి పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.;
కూరగాయల ధరలు పెరిగిపోయాయి. కొనలేనంతగా ధరలు పెరిగి పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు మాసం ధరలతో పోటీ పడుతున్నాయి. ఎన్నడూ లేనిది ప్రతి కూరగాయల ధరలు కొండెక్కి కూర్చోవడంతో ప్రజలు అవస్థలు చెప్పడానికి వీలు కావడం లేదు. భారీ వర్షాలతో కూరగాయల దిగుబడి తగ్గిందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా దిగుమతులు కావడం లేదు. హైదరాబాద్ నగరానికి రోజుకు లక్షల టన్నుల్లో కూరగాయలు వివిధ రాష్ట్రాల నుంచి చేరుకుంటాయి. హోల్‌సేట్ మార్కెట్ కు చేరుకుని అక్కడి నుంచి రిటైల్ మార్కెట్ కు చేరుకుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూరగాయలు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
భారీ వర్షాలకు...
ఇటీవల వరసగా కురిసిన భారీ వర్షాలకు కూరగాయల పంట తీవ్రంగా నష్టపోవడంతో పాటు దిగుబడి కూడా ఎక్కువగా లేకపోవడంతో దిగుమతులు లేవని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. రైతు బజార్లలోనూ అన్ని కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరానికి చుట్టు పక్కల పండించే కూరగాయలు కూడా దిగుబడి తగ్గడంతో తక్కువ మొత్తంలో నగారినికి చేరుకుంటున్నాయి. ఫలితంగా రిటైల్ దుకాణాల్లో వ్యాపారులు కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. దీంతో వినియోగదారులు విలవిలలాడి పోతున్నారు. కూరగాయలు కొనడం కంటే కోడిగుడ్డు, కోడి మాంసం ధరలే తక్కువగా ఉన్నాయంటున్నారు.
ఆకు కూరలు కూడా...
టమాటా కిలో అరవై రూపాయలకు చేరుకుంది. బీరకాయ కిలో ధర వంద రూపాయలు పలుకుతుంది. బెండకాయ కిలో అరవై రూపాయల వరకూ ఉంది. ఇక పర్చి మిర్చి ఒక్కటే కొంత అందుబాటులో ఉంది. ఇక ఆకుకూరల ధరలు కూడా అదిరిపోతున్నాయి. మొన్నటి వరకూ పది రూపాయలకు మూడు చిన్న కట్టలు ఇచ్చే ఆకు కూరలు, ఇప్పుడు రెండు మాత్రమే ఇస్తున్నారు. భారీ వర్షాల కారణంగా దిగుబడి లేదని వ్యాపారులు చెబుతున్నారు. అన్ని ధరలు పెరిగి పోవడంతో పాటు ఉల్లి ధరలు కూడా కిలో ఎనభై రూపాయలకు చేరుకోవడంతో వంటింట్లో వంట కష్టంగా మారింది. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు పెరిగిన కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్నారు.