తెలుగులో ఇక సినిమాలు రిలీజ్ చేయను.. జర్నలిస్టుకి సిద్దార్థ్ వార్నింగ్..
ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూ వస్తున్న హీరో సిద్దార్థ్.. ఇక తెలుగులో సినిమాలు రిలీజ్ చేయను అంటున్నాడు.
తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్ (Siddharth) ప్రస్తుతం తమిళంలోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అక్కడ చేసిన చిత్రాలను డబ్ చేసి ఇక్కడ అభిమానుల కోసం తీసుకు వస్తున్నాడు. ఈక్రమంలోనే తన నటించిన రీసెంట్ హిట్ మూవీ ‘చిత్తా’ని తెలుగులో 'చిన్నా' అనే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది.
ఈ ఈవెంట్ లో సిద్దార్థ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. నిజానికి ఈ సినిమా గత వారంలో సెప్టెంబర్ 28నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ.. ఈ చిత్రాన్ని కొనడానికి ముందుకు రాలేదట. డిస్ట్రిబ్యూటర్స్ ని కలవడానికి సిద్దార్థ్ వెళ్తే.. బయటే నిలబెట్టి మాట్లాడారు అని చెప్పుకొచ్చాడు. సిద్దార్థ్ ని స్టార్ హీరో చేసింది తెలుగు సినిమా పరిశ్రమనే. అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు తనని పట్టించుకోవడం లేదని సిద్దార్థ్ ఎమోషనల్ అయ్యి స్టేజి పైనే కన్నీరు పెట్టుకున్నాడు.
ఈ 'చిన్నా' సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని తెలియజేశాడు. కమల్ హాసన్ ఈ సినిమా చూసి గొప్పగా మాట్లాడాడని, మలయాళ-కన్నడ భాషల్లోని నిర్మాతలు ఈ చిత్రాన్ని ఆసక్తితో కొనుగోలు చేసి రిలీజ్ చేశారని చెప్పుకొచ్చాడు. అలాంటి ఈ మూవీ తన సొంత ఇండస్ట్రీగా భావించే తెలుగులో హిట్ అవ్వకపోతే.. ఇక తెలుగులో తన సినిమాలు రిలీజ్ చేయనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సిద్దార్థ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉంటే, ఇదే ప్రెస్ మీట్ లో సిద్దార్థ్.. ప్రముఖ సినీ జర్నలిస్ట్ ‘సురేష్ కొండేటి’ (Suresh Kondeti) కి స్టేజి పై నుంచే గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ జర్నలిస్ట్ ఇటీవల కొన్ని ప్రెస్ మీట్స్ లో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ వైరల్ అయ్యాడు. ఈ విషయం గురించే సిద్దార్థ్ మాట్లాడుతూ.. "మీరు పద్ధతిగా ప్రశ్నలు అడిగితేనే నేను బదులిస్తా. అలా కాదు మీరు అడిగే చెత్త ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి అని అడిగితే.. అది నాకు అవసరం లేని విషయం" అంటూ నవ్వుతూనే సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.