Land Slides : నిద్రమత్తులో ఉండగానే మృత్యువు తలుపుతట్టింది
కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇప్పటికే 35 మంది వరకూ మరణించారు
భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇప్పటికే 35 మంది వరకూ మరణించారు. ఈ శిధిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కు వర్షం ఆటంకంగా మారింది. మంగళవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఒక్కసారి కొండచరియలు విరిగిపడటంతో ఇంతటి ఘోర విపత్తు జరితింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి కొందరిని రక్షించగలిగారు. రహదారులన్నీ మూసుకుపోవడం వల్ల కూడా సహాయక చర్యలు ఇబ్బందికరంగా మారాయి.
మూడుసార్లు...
చిన్నారులు, వృద్ధులు.. ఒకరేమిటి.. ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో అనేక మంది ఉన్నారు. నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటన కావడంతో ఎవరూ ఈ ప్రమాదం నుంచి బయటపడలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నాలుగు గంటల వ్యవధిలోనే మూడు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. చూరల్‌మాల గ్రామం అసలు కనిపించకుండా పోయింది. అత్తమాల, సూల్‌పుజా వంటి గ్రామాలపై కొండచరియలు విరిగిపడటంతో ఆ గ్రామంలో ఎక్కువ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామాల్లోనే ఎక్కువ మంది మరణించారని చెబుతున్నారు.
రెడ్ అలెర్ట్....
నాలుగు వందల కుటుంబాలు ఈ కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా నష్టపోయారని చెబుతున్నారు. అనేక మంది ఆచూకీ తెలియడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కొండచరియల దిగువ భాగం ఉన్న గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు. వందల సంఖ్యలో వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ఇళ్లన్నీ నేలమట్టం కావడతో సర్వస్వం కోల్పోయారు. ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు. తమకు జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేదని స్థానికులు వాపోతున్నారు. కేరళలో 2018 లో వరదల కారణంగా దాదాపు 400 మంది మరణించారు. తర్వాత ఇదే అది పెద్ద ఘటనగా అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు.