హీట్ వేవ్ పై ఐఎండీ ప్రకటన
అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన ఉక్కపోత, పలు ప్రాంతాల్లో వడగాలులు..
కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా మండుటెండలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. వేసవికాలం పేరు వింటేనే జంకేంతలా ఎండలు ఠారెత్తించాయి. ఉదయం 8 గంటలైనా దాటకముందే బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చాయి. అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన ఉక్కపోత, పలు ప్రాంతాల్లో వడగాలులు.. చాలావరకు ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. మిగతా రోజుల్లో ట్రాఫిక్ తో రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. తాజాగా భారత వాతావరణ శాఖ హీట్ వేవ్ పై కీలక ప్రకటన చేసింది.
దేశంలో హీట్ వేవ్ ముగిసిందని, ఇకపై ఎండలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్ కె జెనామణి ప్రకటించారు. ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు ఇకపై సాధారణ స్థాయికి చేరుతాయని వెల్లడించింది. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో, కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. నేడు, రేపు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జూన్ మొదటి వారంలో కేరళను రుతుపవనాలు తాకనుండగా.. అవి క్రమంలో జూన్ 2 లేదా మూడో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి.