సౌదీలో భర్త.. ఫేక్ డెత్ సెర్టిఫికేట్ తో ఆస్తిని నొక్కేసిన భార్య

సౌదీలో భర్త.. ఫేక్ డెత్ సెర్టిఫికేట్ తో ఆస్తిని నొక్కేసిన భార్య.. మొఘల్‌పురాకు చెందిన మహ్మద్ సలీం శుక్రవారం వినతిపత్రం సమర్పించినట్లు

Update: 2022-07-09 07:46 GMT

మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలని అంటూ ఉంటారు. ఇది నిజమేనని నిరూపించింది ఓ భార్య. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా మొఘల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 45 ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఉంటున్న తన భర్త చనిపోయాడని భార్య, కొడుకుతో కలిసి నకిలీ మరణ ధృవీకరణ పత్రం తయారు చేసి ఆస్తిని కాజేసింది ఓ మహిళ. బాధితుడు మొరాదాబాద్‌కు వచ్చి తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. తాను సజీవంగా ఉన్నానని బాధితుడు చెప్పుకొచ్చాడు. మొరాదాబాద్ డీఎం శైలేంద్ర కుమార్ సింగ్‌కు మహ్మద్ సలీం తాను బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సి వచ్చిందని వినతిపత్రం సమర్పించాడు. నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు తయారు చేసి తన ఆస్తినంతా తన భార్య, కొడుకు లాక్కున్నారని, ఆపై అమ్ముకున్నారని చెప్పారు.

బాధితుడు సలీం గత 45 ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడే పనిచేస్తున్నాడు. అక్కడే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. అతనికి రెండవ భార్య నుండి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అదే సమయంలో సౌదీ అరేబియాలో ఉన్న అతడికి ఈ మరణ ధృవీకరణ పత్రం చేరడంతో మోసం గురించి తెలిసిపోయింది. మొరాదాబాద్‌కు వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే అతనితో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ అంగీకరించలేదు. దీంతో అధికారులను కలిసి.. తాను బతికే ఉన్నానని.. సజీవంగా ఉన్నట్లు ప్రకటించాలని కోరాడు. మోసం చేసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మొఘల్‌పురాకు చెందిన మహ్మద్ సలీం శుక్రవారం వినతిపత్రం సమర్పించినట్లు మొరాదాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. అతని భార్య, పిల్లలు అతని నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని తయారు చేశారు. దానిపై విచారణ చేస్తున్నాం. ఎవరు దోషులుగా తేలినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


Tags:    

Similar News