Narendra Modi : మోదీ చెప్పేశారుగా.. జమిలీ ఎన్నికలు తధ్యమని ఇక అనుకోవాల్సిందే?
ప్రధాని నరేంద్ర మోదీ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై మరోసారి వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై మరోసారి వ్యాఖ్యానించారు. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జమిలి ఎన్నికలపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఒకదేశం ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లినప్పుడే పటేల్ కు నిజమైన నివాళిని అర్పించినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకదేశం - ఒక ఎన్నిక విషయంలో మనం ముందడుగు వేస్తున్నామని తెలిపారు.
ఎవరూ అడ్డుకోలేరని...
త్వరలోనే మన దేశంలో జమిలి ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. జమిలి ఎన్నికలను జరపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న మోదీ త్వరలోనే ఒక దేశం - ఒక ఎన్నిక ను అమలుపరుస్తామని తెలిపారు. దీనిని ఎవరూ అడ్డుకోలేరని కూడా ప్రధాని మోదీ విశ్వాసాన్ని ప్రకటించారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడంతో మరోసారి జమిలి ఎన్నికల విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2027లో దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలను ఆయన ప్రస్తావించడం విశేషం.