కుల్గాంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
గాలింపు చర్యలు ఎన్‌కౌంటర్‌గా మారాయని, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు చెప్పారు.
జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో సోమవారం భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు చెప్పారు. కుల్గాం జిల్లా ట్రబ్జు ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తెలియడంతో భద్రతా దళాలు నౌపొర ఖేర్‌పొర ప్రాంతంలో గాలింపు చేపట్టారు. గాలింపు చర్యలు ఎన్‌కౌంటర్‌గా మారాయని, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌లోని ఒక గ్రామంలో సోమవారం మధ్యాహ్నం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో హతమైన ఉగ్రవాదులను ఇంకా గుర్తించలేదు. J-K పోలీస్, ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్త బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. భద్రతా వలయాన్ని ఛేదించే ప్రయత్నంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.
దోడాలో ఉగ్రవాది అరెస్ట్:
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. అతని దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో భద్రతను పెంచారు. ఆదివారం రాత్రి దోడా పట్టణం శివార్లలోని చెక్ పాయిట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేయగా.. ఒక వ్యక్తి దగ్గర ఆయుధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని దోడాలోని కోటి గ్రామానికి చెందిన ఫరీద్ అహ్మద్‌గా గుర్తించారు. ఫరీద్ దగ్గర నుంచి ఒక చైనీస్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.