World Cup 2023 : ఇక ఆడటం కష్టమేనా... చేవతగ్గకపోయినా... ఏజ్ అడ్డంగా మారనుందా?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు అంతర్జాతీయ మ్యాచ్‌లలో కనిపించకున్నా ఐపీఎల్ తో మాత్రం సత్తా చాటే అవకాశముంది
వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ ఓటమితో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ప్రధానమైన ఆటగాళ్లను వచ్చే వరల్డ్ కప్ లో మనం చూడలేకపోవచ్చు. కేవలం ఐపీఎల్ కే వారు పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే వరల్డ్ కప్ 2027 లో జరగనుంది. అప్పటి వరకూ అనేక మంది బ్యాటర్లు, బౌలర్లు ఉండే అవకాశాలు లేవు. ఇప్పటికే వయసు పెద్దది కానుండటంతో పాటు వెనక నుంచి యువకులు దూసుకు వస్తుండటం కూడా వీరి నిష్క్రమణకు ఒక కారణంగా చూడాలి.
రోహిత్ కు 41 ఏళ్లు రావడంతో...
ప్రధానంగా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే వరల్డ్ కప్‌కు ఆడే అవకాశాలు లేవు. రోహిత్ వయసు ఇప్పటికే 37 ఏళ్లు. ఆ వరల్డ్ కప్ కు నలభై ఒక్క ఏళ్లు కాబట్టి రోహిత్ తనంతట తాను స్వచ్ఛందంగా తప్పుకునే అవకాశాలే ఉన్నాయి. కెప్టెన్ గా, ఓపెనర్ గా రోహిత్ శర్మ సాధించిన విజయాలను మరిచిపోలేం. ప్రధానంగా ఈ వరల్డ్ కప్ లో దూకుడుతో ఆడిన రోహిత్ టీంను ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్స్ కు చేర్చిన ఘనత కూడా రోహిత్ శర్మదే. ఫైనల్ లో ఓడిపోయి ఉండవచ్చు గాక, కానీ రోహిత్ భారత్ కు అందించిన సేవలను మర్చిపోలేం.
చేజార్చుకోకపోవచ్చు...
రోహిత్ శర్మ వచ్చే టీ 20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలను కూడా సెలెక్టర్లు పరిశీలించే అవకాశముంది. ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు ఛాన్స్ ఉందన్న క్యాంపెయిన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే రోహిత్ ఫ్యాన్స్ మాత్రం అతనిలో చేవ తగ్గలేదని, దూకుడుగా ఆడటమే కాకుండా స్కోరు బోర్డును వేగంగా పరుగులు తీయించడంలో రోహిత్ రాటుదేలాడు. అలాంటి రోహిత్ ను అనవసరంగా చేజార్చుకోవడం అవివేకమని కూడా కామెంట్స్ వినపడుతున్నాయి.
కోహ్లి మాటేంటి?
మరోవైపు విరాట్ కోహ్లి కూడా 35 ఏళ్లకు వచ్చేశాడు. వచ్చే వరల్డ్ కప్ సమయానికి కోహ్లి వయసు 39 ఏళ్లు ఉంటుంది. ఈ వరల్డ్ కప్ లో కొనసాగించిన ఫామ్ ను కంటిన్యూ చేయగలిగితే కోహ్లి కంటిన్యూ అవుతాడు. ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ఫామ్ కోల్పోతే మాత్రం డౌటే. వచ్చే వరల్డ్ కప్ లో ఆడటం కష్టమే. కానీ కోహ్లి లాంటి ఆటగాడిని సెలెక్టర్లు వదులుకునేంత పిచ్చి పని చేయకపోవచ్చు. కానీ ఫామ్ ను బట్టే కోహ్లి కొనసాగింపు ఉంటుందన్నది మాత్రం వాస్తవం. అయితే వీళ్లిద్దరూ వచ్చే వరల్డ్ కప్ లో కనపడకపోయినా మరికొద్ది కాలం ఐపీఎల్ కనిపిస్తారన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని మాదిరిగా రోహిత్, కోహ్లిలకు ఐపీఎల్ లో ఆడే చేవ ఉంది. సత్తా ఉంది. కాబట్టి వాళ్ల ఫ్యాన్స్ దిగులు చెందాల్సిన పనిలేదు.