మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ముంబై ఇండియన్స్ న్యూ యార్క్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ నికోలస్ పూరణ్ బ్యాట్ తో తాండవం ఆడాడు. కీరన్ పోలార్డ్ గాయం కారణంగా టోర్నమెంట్ కు దూరం కాగా.. ముంబై కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన పూరన్ జట్టును ఫైనల్ కు తీసుకుని వెళ్ళాడు. ఫైనల్ లో 55 బంతుల్లో 137 పరుగులు చేసి సియాటెల్ ఆర్స్ ను చిత్తు చేశారు. గ్రూప్ స్టేజ్ లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన ముంబై ఇండియన్స్ ఏకంగా టైటిల్ ను ఎగరేసుకుని పోవడం విశేషం.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్క్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్క్స్ జట్టులో డికాక్ అద్భుతంగా ఆడాడు. 52 బంతుల్లో 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన వాళ్ళెవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఎక్కడా తడబడలేదు. మొదటి ఓవర్ లో స్టీవెన్ టేలర్ డకౌట్ గా వెనుదిరిగినా.. పూరన్ మాత్రం సిక్సర్లతో చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 137 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 13 సిక్సర్లు ఉన్నాయి. పూరన్ విజృంభణతో భారీ లక్ష్యం చిన్నదైపోయింది. ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ముంబై విజయాన్ని అందుకుంది. అమెరికా లో మొదటిసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్ ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గెలుచుకోవడంతో ఆ ఫ్రాంఛైజ్ అభిమానులు ఎంతో ఆనందపడుతూ ఉన్నారు.