India Vs Srilanka Third One Day : ఈ మ్యాచ్ కూడా పోతే ఇక అంతే.. నవ్వి పోతారు నలుగురూ

భారత్ - శ్రీలంక మూడో వన్డే నేడు జరగనుంది. ఆఖరి వన్డే కావడంతో సిరీస్ ఎవరదనేది తేలనుంది.

Update: 2024-08-07 03:57 GMT

భారత్ - శ్రీలంక మూడో వన్డే నేడు జరగనుంది. ఆఖరి వన్డే కావడంతో సిరీస్ ఎవరదనేది తేలనుంది. లేకుంటే టై కానుంది. తొలి వన్డే మ్యాచ్ టై కాగా, రెండో వన్డే మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. ఇక మూడో వన్డే మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఓడిపోతే సిరీస్ చేజారినట్లే. టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డే విషయంలో మాత్రం తడబడుతుంది. శ్రీలంక బౌలర్లకు తలవంచుతుంది. రెండు వన్డేల్లో రోహిత్ శర్మ మినహా మరే బ్యాటర్ కుదురుగా ఆడలేకపోయాడు.

వరసగా అవుట్ అవుతూ...
ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇతర బ్యాటర్లకంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. శుభమన్ గిల్ పెద్దగా రాణించలేకపోతున్నాడు. కోహ్లి సంగతి చెప్పాల్సిన పనిలేదు. కోహ్లి మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే అలా వచ్చి ఇలా అవుటయి వెళ్లిపోవడం కోహ్లి వంతయింది. ఇక కేఎల్ రాహుల్ కూడా తన ఆటతో మెప్పించలేకపోయాడు. రెండు మ్యాచ్ లలోనూ విఫలమయ్యాడు. శివమ్ దూబే కూడా అంతే. ఇలా వరస బెట్టి బ్యాటర్లు విఫలం కావడం శ్రీలంకకు కలసి వచ్చింది. అందుకే రెండో మ్యాచ్ లో విజయం సాధించగలిగింది.
స్పిన్నర్ల దెబ్బకు...
ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కొనడంలో భారత బ్యాటర్లు ఫెయిలవుతున్నారు. శ్రీలంక టార్గెట్ గా పెద్దగా పరుగులు పెట్టకపోయినప్పటికీ తొలి పది ఓవర్లలో ఉన్న ఊపు తర్వాత ఉండటం లేదు. అసలు భారత్ బ్యాటర్లపై నమ్మకం లేకుండా పోయింది. శ్రేయస్ అయ్యర్ కూడా విఫలం అవుతుండటంతో చూసేందుకు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తున్నా మైదానంలోకి దిగిన తర్వాత అంతా ఉత్తిదే అన్నట్లు తయారైంది మనోళ్ల పరిస్థితి. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి సిరీస్ ను సమం చేసుకుంటే భారత్ పరువు నిలబడుతుంది. లేకుంటే సిరీస్ చేజారిపోయినట్లే.


Tags:    

Similar News