India Vs Australia T20 : ఓడిపోయినందుకు కాదు కానీ... అన్ని పరుగులు చేసినా
భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో టీ 20 మ్యాచ్ చూసిన వారికి ఇండియా ఓటమి పాలుఅవుతుందని ఎవరూ ఊహించి ఉండరు
భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో టీ 20 మ్యాచ్ చూసిన వారికి ఇండియా ఓటమి పాలుఅవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కావాల్సినంత స్కోరు. అందులోనూ కీలక వికెట్లు పడిపోయాయి. ఇక రెండు వికెట్లు పడగొడితే చాలు మ్యాచ్ మన సొంతమే అవుతుంది. చేయాల్సిన రన్ రేటు కూడా ఎక్కువగానే ఉంది. అయితే డెత్ ఓవర్లలో మనోళ్లు మళ్లీ చేతులెత్తేశారు. ఆసీస్ కు మ్యాచ్ ను సమర్పించుకున్నారు. ఏమాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉన్నా మ్యాచ్ మన చేజారి పోయేది కాదు.
రుతురాజ్ చెలరేగి...
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే భారత్ అతి విలువైన వికెట్లు మూడు కోల్పోయింది. యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్ లు వెంట వెంటనే అవుట్ కావడం, సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరగానే వెనుదిరగడంతో భారత్ ఒక దశలో రెండు వందల స్కోరు అయినా చేస్తుందా? అన్న డౌట్ వచ్చింది. కానీ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ లు నిలదొక్కుకున్నారు. రుతురాజ్ సెంచరీ బాదాడు. అందుకు తిలక్ సహకరించాడు. చివరి ఓవర్లలో రన్ రేటును బాగా పెంచాడు. దీంతో భారత్ 20 ఓవర్లకు 222 పరుగులు చేసింది. టీ 20లలో ఇది ఎక్కువగానే చూడాలి.
ఛేదనలో...
కానీ తర్వాత ఛేదనలోకి దిగిన ఆసీస్ బ్యాటర్లను త్వరత్వరగానే పెవిలియన్ కు పంపారు. రవి బిష్ణోయ్ రెండు కీలక వికెట్లు తీశాడు. ఆవేష్ ఖాన్ ఒక వికెట్, అర్షదీప్ సింగ్ మరొక వికెట్ తీయడంతో భారత్ విజయం ఖాయమనిపించేలా కనిపించింది. కానీ అక్కడ ఉన్నది మ్యాక్స్ వెల్. మ్యాక్‌వెల్, కెప్టెన్ వేడ్ కలసి భారత్ బౌలర్లను చీల్చి చెండాడారు. చివరి రెండు ఓవర్లకు 46 పరుగులు చేయాల్సి ఉంటే సిక్సర్లు, ఫోర్లను బాదేసి మ్యాచ్ ను తనవైపు తిప్పుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలిచింది. ఓడిపోయినా మ్యాచ్ చూసేందుకు మాత్రం అద్భుతంగా అనిపించింది. ఐదు మ్యాచ్ ల సిరిస్ లో భారత్ 2 - 1 గా ఉంది. నాలుగో మ్యాచ్ డిసెంబరు 1వ తేదీన జరగనుంది.