సంగారెడ్డిలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతగా నమోదు
నిద్రావస్థలో ఉన్న ప్రజలు భూమి కదలికలతో ఉలిక్కిపడి.. ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. కొంతసేపటివరకూ..
సంగారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో కోహీర్ మండలం బిలాల్ పూర్ లో భూమి కంపించింది. నిద్రావస్థలో ఉన్న ప్రజలు భూమి కదలికలతో ఉలిక్కిపడి.. ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. కొంతసేపటివరకూ ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.
నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు వెల్లడించారు. కాగా.. ఈ భూప్రకంపనల్లో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకముందు గతేడాది జనవరిలోనూ కోహీర్ మండలంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.