Telangana : ఆ తొమ్మిది మంది ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు.. 300 గజాల ఇంటి స్థలం
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి మాట్లాడారు;
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్ అయిన టీజీని గత ప్రభుత్వం టీఎస్ గా మార్చిందన్నారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయలేదు. కనీసం రాష్ట్ర గీతాన్ని కూడా అమలు చేయలేదు. ఆ ఆలోచన కూడా చేయలేదు. తెలంగాణ తల్లి పదేళ్లు వివక్షకు లోనైందని రేవంత్ రెడ్డి అన్నారు. తన కుటుంబ కోసమే నాటి ప్రభుత్వం పనిచేసిందన్నారు. ఆలోచించిందన్నారు. బహుజనుల ఆకాంక్ష మేరకు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగిందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడం జరిగిందన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ నుంచి టీజీగా మార్చామన్నారు.
కవులు, కళాకారులకు....
తమ ప్రభుత్వం అధికారంలోకివచ్చిన ఏడాదిలోగా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేసిందన్నారు. సర్వం కోల్పోయి తెలంగాణ ప్రభుత్వం గుర్తింపునకు నోచుకోకుండా ఉన్న కవులు, కళాకారులను సన్మానించాలని నిర్ణయించామన్నారు. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి కుటుంబాలను, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్, పాశం యాదగిరి, జక్కారాఘవరావులను ప్రభుత్వం గుర్తించడమే కాకుండా మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఫ్యూచర్ సిటీ ఇస్తామన్నారు. కోటి రూపాయల నగదు పారితోషికం ఇస్తున్నామని చెప్పారు. నాలుగు కోట్ల రూపాయల ప్రజలు వారి త్యాగాలు మరవకుండా ఉండేందుకు వీరిని గుర్తించి ఈ సన్మానం అందిస్తున్నామని తెలిపారు.
అధికారికంగా ప్రతి ఏడాది...
కేవలం ఒక వ్యక్తి కోసమో, కుటుంబం కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పరిపాలన గుండెకాయ వంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రతి ఏడాది డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భవిష్యత్ లో దీనిని మార్చాలన్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ లో తెలంగాణ ను అభివృద్ధి పథం వైపు నడిపించేలా తమకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఏడాది పాలనలో తాము విజయవంతంగా పేదల పక్షాన నిలిచామన్నారు.