SlBC Accident : మరో మృతదేహం ఆనవాళ్లు గుర్తింపు.. కాలు బయటకు రావడంతో?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో మరో మృతదేహాన్ని సహాయక బృందాలు గుర్తించాయి.;

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో మరో మృతదేహాన్ని సహాయక బృందాలు గుర్తించాయి. ప్రమాదం జరిగిన 32వ రోజుకు కానీ మరో మృతదేహం ఆచూకీ లభ్యమయింది. శునకాలు గుర్తించిన ప్రాంతంలోనే తవ్వకాలు జరుపుతుండటంతో ఒక మృతదేహం ఆనవాళ్లు లభ్యం కావడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోకో ట్రైన్ శిధిలాల కింద సిబ్బంది మరో మృతదేహం గుర్తించారు. ఇంకా ఆరు మృతదేహాల కోసం వెదుకులాట జరుగుతుంది. అయితే కాలు కనపడటంతో అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. మృతదేహం పూర్తిగా నీటిలో నాని ఉండటంతో ఆనవాళ్లు పట్టకుండా తయారయిందని సహాయక బృందాలు చెబుతున్నాయి.
ఎనిమిది మందిలో...
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో తప్పిపోయిన ఎనిమిది మందిలో ఇప్పటి వరకూ ఒక మృతదేహం మాత్రమే లభ్యమయింది. ఇప్పుడు తాజాగా మరో మృతదేహం ఆనవాళ్లు కూడా లభించడంతో ఇక్కడే అన్ని మృతదేహాలుంటాయని అభిప్రాయం సహాయక బృందాల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఎనిమిది మంది మరణించి ఉంటారని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. అయితే బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయి జల సమాధి అయి ఉంటారని భావిస్తున్నారు.
ఇంకా ఆరు మృతదేహాలు...
తప్పిపోయిన కార్మికుల మృతదేహాల కోసం శ్రీశైలం టన్నెల్ లో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. దాదాపు పన్నెండు బృందాలు నిరంతరం టన్నెల్ లో సహాయక చర్యలు చేపడుతున్నారెస్క్యూ ఆపరేషన్ ఒక కొలిక్కి రాలేదు. ఈరోజు మృతదేహం లభ్యం కావడంతో మిగిలిన ఆరు మృతదేహాలు కూడా అక్కడే ఉంటాయని భావించి అక్కడ తవ్వకాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీశైలం టన్నెల్ ప్రమాదంపై సమీక్ష నిర్వహించి సహాయక చర్యలను కొనసాగించాలని ఆదేశించారు. నేడు కొంత పురోగతి కనిపించినట్లే అనుకోవాలి.