Telangana : మంత్రివర్గంలోకి తీసుకునేది వీళ్లేనా? ఆ ఐదుగురు వారేనటగా?
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం దగ్గరపడింది. ఉగాదికి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది;

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం దగ్గరపడింది. ఉగాదికి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఒక ముస్లిం సామాజికవర్గానికి, ఒక ఎస్.సికి అవకాశం లభించే ఛాన్స్ ఉన్నాయని తెలిసింది. ఈరోజు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరగనున్న ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఢిల్లీ చేరుకుని ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశంలోనే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
కొన్ని జిల్లాలకు...
సమావేశంలో తీసుకునే నిర్ణయాలను పార్టీ అధినేత రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత అధికారికంగా మంత్రివర్గ విస్తరణపై ప్రకటన రానుంది. దాదాపు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ మంత్రి వర్గ విస్తరణ జరపకపోవడంపై అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అనేక మంది ఆశావహులు మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు అసలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంపై కూడా అసహనం వ్యక్తమవుతుంది. ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత మంత్రివర్గం ఏర్పాటయింది. అప్పుడు ఆరు పోస్టులను ఖాళీగా ఉంచారు. ఆ ఆరు పోస్టులు భర్తీ చేయడానికి రెండేళ్ల సమయం పట్టడంతో సీనియర్ నేతలతో పాటు ఆశావహులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీరికే అవకాశం అట...
అందుతున్న సమాచారం మేరకు ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశముంది. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి మంత్రి పదవి ఇస్తారంటున్నారు. ఇక ఎస్.సి కోటాలో గడ్డం వివేక్ కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు వినపడుతుంది. బీసీలలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఎస్.టి కోటాలో బాలు నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిపదవి ఇస్తారా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒకే జిల్లాలో, ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు ఇవ్వడంపై కాంగ్రెస్ హైకమాండ్ ఏ మేరకు రెస్సాండ్ అవుతుందన్నది వేచి చూడాల్సిందే. విజయశాంతి పేరు కూడా బాగానే ప్రచారంలో ఉంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.