Priyanka Gandhi : తల్లి మాటలను గుర్తు చేసుకుని... ఆ విషయాన్ని పంచుకున్న ప్రియాంక
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గత రెండు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గత రెండు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఈరోజు మధిర సభలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాత్రి తల్లి సోనియా గాంధీ ఫోన్ చేశారన్నారు. తెలంగాణలో ప్రచారం చేస్తున్నావు కదా? ఏం మాట్లాడతావు అని తనను ప్రశ్నించారన్నారు. తాను అందుకు సత్యమే చెబుతానని చెప్పాననడంతో సభ మొత్తం చప్పట్లతో మారు మోగింది. దానికి తన తల్లి సోనియా హామీలు ప్రజలకు ఇవ్వడం కాదని వాటిని ప్రజలకు చేరవేసేలా చూడాలని తనను ఆదేశించినట్లు ప్రియాంక గాంధీ ప్రజలకు చెప్పడం విశేషం. తన తల్లి మాటలను గుర్తుకు తెచ్చుకుని తాను ఇక్కడ అధికారంలోకి వస్తే తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు.
పాదయాత్ర చేసిన భట్టిని...
తన సోదరుడు రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో పాదయాత్ర చేశారని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఆయన పాదయాత్ర చేశారన్నారు. అలాగే ఇక్కడ భట్టి విక్రమార్క రాష్ట్రమంతటా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశానని అన్నారు. భట్టి నియోజకవర్గం మధిరకు రావడం సంతోషంగా ఉందన్న ప్రియాంక గాంధీ భట్టి పాదయాత్ర చేయడం అభినందనీయమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి అవినీతిని చేయడం, లంచాలు తీసుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.