Delhi Liquor Scam Case : కవిత అరెస్ట్ అయింది ఇలా.. స్కామ్ ఎలా జరిగిందంటే?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో రెండు ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖుల పేర్లు న్నాయి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖల పేర్లు బయటకు రావడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో అనేక మంది అరెస్టయ్యారు. తెలంగాణ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. తర్వాత ఏపీ నుంచి పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వీరితో పాటు ఢిల్లీలో అధికార పార్టీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా అరెస్టయ్యారు. వందల కోట్లు ఈ స్కామ్ లో చేతులు మారాయన్న ఆరోపణలు ఈడీ అధికారుల నుంచి వినిపించాయి.
ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తూ...
చాలా మంది ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఈ కేసులో అప్రూవర్ గా మారారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చింది. అప్పటి వరకూ మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. అయితే వాటిని ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తూ 2020 సెప్టంబరులో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే అనేక అనుమానాలకు తావిచ్చింది. పెద్దయెత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందని వ్యాపారులకు ఢిల్లీలో లిక్కర్ షాపులు అప్పగించారన్న ఆరోపణలు వినిపించాయి.
లిక్కర్ పాలసీని...
లిక్కర్ పాలసీని రూపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021 జనవరిలో మంత్రుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోియా, సత్యేంద్ర జైన్, కైలాశ్ గెహ్లాట్ లు ఉన్నారు. అయితే ఈ మంత్రల బృందం లిక్కర్ కొత్త పాలసీని తయారు చేసింది. మే 21 2021న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఈ పాలసీలో పెద్దయెత్తున డబ్బులు చేతులు మారాయని ఉప్పందడంతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయాలాని కోరారు. అప్పటి నుంచి ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో అనేకమంది నిందితులుగా చేరారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్ గా మారారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు.
అనేకసార్లు విచారించి...
కల్వకుంట్ల కవితను ఈ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు అనేకసార్లు విచారించారు. ఢిల్లీలోనీ ఈడీ కార్యాలయానికి రప్పించి విచారణ జరిపారు. కవిత తన పదహారు సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారని, ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నించారని కూడా గతంలో ఈడీ అధికారులు ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయని కనుగొన్న అధికారులు ఆ దిశగానే విచారణ జరిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్‌లోనూ, ఢిల్లీలో ఒక స్టార్ హోటల్ లో నిందితులు సమావేశమై ఈ స్కామ్ కు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఆధారంగా కవిత పేరును కూడా సీబీఐ అధికారులు ఈ స్కామ్ లో నిందితురాలిగా చేర్చారు. కవిత పీఏ అశోక్ కౌశిక్ న్యాయస్థానం ఎదుట ఇచ్చిన సమాచారం కూడా ఇందుకు తోడయింది. సుదీర్థకాలం విచారణ జరిపిన తర్వాత కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.