Harish Rao : మొన్నటి వరకూ జేబులో పెట్టుకుని తిరిగారుగా ... నిజంగా రాజీనామా చేసేస్తారా? ఇరుక్కుపోయినట్లేనా?
మాజీ మంత్రి హరీశ్ రావు అతి విశ్వాసానికి పోయి చిక్కుల్లో చిక్కుకున్నట్లయింది;
మాజీ మంత్రి హరీశ్ రావు అతి విశ్వాసానికి పోయి చిక్కుల్లో చిక్కుకున్నట్లయింది. ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి రెడీ ఉండాలంటూ కాంగ్రెస్ నుంచి సవాళ్లు ప్రారంభమయ్యాయి. రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల రుణాన్ని ఏకకాలంలో రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం రెడీ అయింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంది. ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయిందని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రుణమాఫీ విధివిధానాలపై ఇంకా నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.
రైతుల రుణమాఫీని...
జులై ఒకటో తేదీ నుంచి రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రులు కూడా చెబుతున్నారు. దీంతో ఎన్ని కష్టాలకు ఓర్చయినా రుణమాఫీ చేయాలన్న ధృఢ నిశ్చయంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్లే కనపడుతుంది. అయితే విధివిధానాల విషయంలో రేవంత్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పేదరైతులకు రుణమాఫీని చేయడం అందరూ హర్షిస్తారు. అంతే తప్ప కోటీశ్వరులైన వారికి, పదుల ఎకరాలున్న వారికి రుణమాఫీ చేసినా ప్రయోజనం ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రైతుల్లో పేదలను గుర్తించి సాగు చేసే రైతులకే ఈ రుణమాఫీ పథకాన్ని ఏకకాలంలో వర్తింప చేస్తే ఎవరూ పెద్దగా అభ్యంతరం పెట్టరు. విమర్శలు చేయడానికి కూడా అవకాశం ఉండదన్నది కాంగ్రెస్ నేతల భావనగా ఉంది.
సవాల్ చేసి మరీ...
తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఒట్టేసి మరీ అనేక ప్రాంతాల్లో ఆయన హామీ ఇచ్చారు. అయితే దీనిని ఎన్నికల స్టంట్ గా బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీసుకున్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. అంతటితో ఆగలేదు. నేరుగా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి తన రాజీనామా లేఖను మీడియా ప్రతినిధులకు ఇచ్చారు. అంటే రుణమాఫీ రేవంత్ సర్కార్ చేయదన్న గట్టి నమ్మకంతోనే హరీశ్ రావు అంతటి పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారనే అనుకోవల్సి ఉంటుంది. స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వలేదని అప్పుడే కాంగ్రెస్ నేతలు విమర్శించినా అందుకు కూడా సిద్ధమేనని ఆయన ప్రకటించారు.
వెనక్కు తగ్గుతారా?
ఇప్పుడు జులై నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు పదిహేను నాటికి ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమయింది. నిజంగా అదే జరిగితే హరీశ్ రావు తన మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా? లేదా? అన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ తో సహా అన్ని స్థానాల్లో ఓటమి పాలు కావడంతో బీఆర్ఎస్ నేతలు కొంత ఆలోచనలోపడ్డారు. మరి చేసిన సవాల్ కు హరీశ్ రావు కట్టుబడి ఉంటారా? లేదా? రుణమాఫీలో వారికి చేయలేదు.. వీరికి చేయలేదంటూ తన రాజీనామా ప్రకటనను వెనక్కుత తీసుకుంటారా? అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. మొత్తం మీద హరీశ్ రావు ఆవేశంతో చేసిన ప్రకటనతో అడ్డంగా ఇరుక్కుపోయినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.