కేసీఆర్ కు మాజీ ఎంపీ ఘాటు లేఖ
మాజీ పార్లమెంటు బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మాజీ పార్లమెంటు బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా తో పాటు పార్టీ అధినేత కేసీఆర్ కు ఘాటు లేఖ రాశారు. తాను వ్యక్తిగతంగా అవమానించబడ్డానని తెలిపారు. తెలంగాణలో బీసీలు వివక్షతకు గురవుతున్నారని తెలిపారు. తనకు రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే తనకు ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు కలవడానికి వీలు కల్పించలేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రస్తావించిన తనపై అసహనం చేసిన తీరు తనను కలచి వేసిందన్నారు.
వద్దామంటే అవకాశమేదీ?
బీసీల సమస్యలను మీ వద్ద ప్రస్తావిద్దామనుకుంటే కనీసం అవకాశం కల్పించలేదన్నారు. బీసీ, ఈబీసీ పేద విద్యార్థులకు కేవలం 11 శాతం వరకే ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వడం వంటి అంశాలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాయని బూర నర్సయ్య గౌడ్ లో తన లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ మీ దృష్టికి తీసుకెళ్లాలంటే అవకాశమే ఇవ్వరని, అలాంటప్పుడు తాను టీఆర్ఎస్ లో ఉండి ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కాంట్రక్టర్లు ఏడాది టర్నోవర్ ఇతర ప్రాంత కాంట్రాక్టర్ల టీడీఎస్ అంత కూడా లేదని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన ఆత్మగౌరవ సభ సమాచారం కూడా తనకు ఇవ్వలేదని పేర్కొన్నారు. మీరంటే అభిమానం ఉన్నప్పటికీ అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉందన్నారు. రాజకీయ వెట్టి చాకిరీని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరన్నారు. అందువల్లనే టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నానని ఆయన కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.