కరోనాను కట్టడి చేయాలంటే.. ఈ చర్యలు తీసుకోండి
కరోనా తీవ్రతను తగ్గించేందుకు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని సూచనలను చేసింది;
కరోనా తీవ్రతను తగ్గించేందుకు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని సూచనలను చేసింది. ఈరోజు కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యాసంస్థల్లో ఆన్ లైన్ బోధనను కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ వరకూ ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ విద్యాబోధనను కొనసాగించాలని చెప్పింది. మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
నిబంధనలు అమలయ్యేలా...
కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. మేడారం జాతర, రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో కోవిడ్ నిబంధలను అమలు పర్చాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.