BJP : అలక బూనారా? లేక అసహనంతో ఉన్నారా? ఇంతకీ రీజన్ ఏంటి బాసూ?
ఎన్నికలకు ముందు వరకూ దూకుడుగా ఉన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు
ఎన్నికలకు ముందు వరకూ దూకుడుగా ఉన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పడు ఒంటి కాలి మీద లేచిన ధర్మపురి అరవింద్ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అరవింద్ రెండుసార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. సామాన్య విషయం కాదు. ఆషామాషీ కాదు. కానీ తన పట్టు జారిపోకుండా పార్లమెంటు నియోజకవర్గంలో పట్టు నిలుపుకుంటూ వచ్చారు. సీనియర్ నేత డీఎస్ కుమారుడిగా ఆయన రాజకీయాల్లో సక్సెస్ ను బాగా చూడగలిగారు. కుటుంబం నుంచి మద్దతు లేకపోయినా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు.
రెండుసార్లు గెలిచి...
ధర్మపురి అరవింద్ 2019 పార్లమెంటు ఎన్నికల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. అరవింద్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాడు అరవింద్ పేరు మారుమోగిపోయింది. అరవింద్ దెబ్బకు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కుదేలైపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ నెలకొనేలా ధర్మపురి అరవింద్ చేసుకోగలిగారు. అయితే 2023 ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయినా డీలా పడలేదు. 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో నిజాామాబాద్ నుంచి తిరిగి విజయం సాధించారు.
వారు ఫెయిల్ కావడంతో...
బలమైన బంధుత్వాలు కూడా ఉండటంతో పాటు మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో బీసీ ఓటు బ్యాంకు ఆయన తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. దీంతో పాటు నిజామాబాద్ లో కాంగ్రెస్ ఎంపీలుగా మధుయాష్కీ ఫెయిలయ్యారు. తర్వాత వచ్చిన కల్వకుంట్ల కవిత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ధర్మపురి అరవింద్ ప్రజలకు దగ్గరగా ఉండటంతో ఆయనకు ఏ సమస్య అయినా చెప్పుకునే వీలుందని ప్రజలు భావించారు. దీనికి తోడు బీజేపీ వేవ్ కూడా బలంగా వీయడంతో ఆయన విజయాలకు తిరుగు లేకుండా పోయింది. రెండుసార్లు గెలిచిన ధర్మపురి అరవింద్ ఈసారి మాత్రం కాస్త సైలెంట్ గా కనపడుతున్నారు.
కనీసం ఆ పదవి అయినా..
ధర్మపురి అరవింద్ మోదీకి వీరభక్తుడు. ఆయన మోదీని చూసి, బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఆయనకు రుచించడం లేదంటున్నారు. కేబినెట్ మంత్రి పదవి తనకు దక్కకపోయినా కనీసం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా దక్కుతుందని భావిస్తున్నారు. బీజేపీలో సీనియర్ గా ఉన్న తనకు కొందరు పదవి దక్కే విషయంలో అడ్డుపడుతున్నారని ఆయన ఒకింత అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లేదా ఢిల్లీలో తప్పించి హైదరాబాద్ కు కూడా అతి తక్కువ సార్లు వచ్చి పోతున్నారు. పార్టీ నేతలకు కూడా టచ్ లో లేరని తెలిసింది. మరి ధర్మపురి అరవింద్ ఎలాంటి అసహనం ఎందుకనేది తెలియాల్సి ఉంది.