Telangana : కొత్త పీసీసీ అధ్యక్షుడు ఆయనేనా... ఆయనేతైనే బాగుంటుందంటున్న నేతలు
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రస్తుతం ఉన్న పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రస్తుతం ఉన్న పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు పీసీసీ చీఫ్ గా ఉండరు. అందుకనే త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరగబోతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కొత్త పీసీసీ చీఫ్ పదవి కోసం పార్టీ నేతలు అనేక మంది పోటీ పడుతున్నారు. పార్టీ అధికారంలో ఉండటంతో పీసీసీ చీఫ్ పదవికి కూడా మంచి ప్రయారిటీ ఉండనుండటంతో ఈ పదవికి డిమాండ్ పెరిగింది.
నేతలతో చర్చలు...
అయితే హైకమాండ్ పీసీసీ చీఫ్ గా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిన రాహుల్, సోనియా, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిసింది. పీసీసీ చీఫ్ గా ఎస్.సి లేదా బీసీ వర్గానికి చెందిన వారిని నియమించాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి పదవిలో రెడ్డి సామాజికవర్గం నేత ఉండటంతో పీసీసీ చీఫ్ పదవి వెనకబడిన వర్గాల నేతలకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు.
బీసీలకే ఛాన్స్...
డిప్యూటీ సీఎంగా దళితులకు అవకాశమివ్వడంతో పీసీసీ చీఫ్ గా బీసీలకు ఇస్తే సముచితంగా ఉంటుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. బీసీల్లో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. మధు యాష్కి గౌడ్ తో పాటు అనేక మంది ఈ పదవులకు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పార్టీ పరంగా కూడా సమర్థంగా విపక్ష విమర్శలను తిప్పికొట్టాలన్నా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయం వైపు నడిపించాలన్నా సమర్థుడైన నేత అవసరమని భావిస్తున్నారు. త్వరలోనే తెలంగాణకు నూతన పీసీసీ చీఫ్ నియామకం జరగబోతుందని తెలిసింది.