బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. వైస్ ఛాన్సిలర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి

Update: 2022-07-31 03:02 GMT

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. వైస్ ఛాన్సిలర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫుడ్ పాయిజన్ కావడంతో ఇటీవల అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొత్త టెండర్లను పిలవాలని, మెస్ ను కొత్త వారికి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి టెండర్ల ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుందని, వెంటనే సాధ్యం కాదని సహకరించి తరగతులకు హాజరు కావాలని వైస్ ఛాన్సిలర్ వెంకటరమణ ఎంత నచ్చ చెప్పినా విద్యార్థులు మాత్రం దిగిరాలేదు. వెంటనే మెస్ మేనేజ్ మెంట్ ను మార్చాల్సిందేనని పట్టుబట్టారు.

మెస్ మేనేజ్‌మెంట్ ను....
నిన్న రాత్రంతా మెస్ లోనే బైఠాయించారు. ఎటువంటి ఆహారం తీసుకోలేదు. ఈరోజు మరోసారి వీసీ విద్యార్థులతో చర్చలు జరపనున్నారు. తమకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించాలని, ఈ భోజనం తినలేకపోతున్నామని విద్యార్థులు అంటున్నారు. కాంట్రాక్టర్ ను మార్చేంత వరకూ తాము ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈరోజు జరిగే చర్చలైనా ఒక కొలిక్కి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.


Tags:    

Similar News