ఇత్తడి పాత్రలో ఇరుక్కుపోయిన బాలుడు..
రెండేళ్ల బాలుడు ఇత్తడి పాత్రలోకి దిగాడు. బాలుడి తల మాత్రం పైనే ఉండగా.. శరీరం మొత్తం ఆ పాత్రలో ఇరుక్కుపోయింది. బయటకు..;
పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ చేసే.. కొన్ని చిలిపి పనులు వారి ప్రాణాలమీదికి తెస్తున్నాయి. నిన్న కొమురం భీం జిల్లాలో పిల్లలు దాగుడుమూతల ఆట.. ఓ చిన్నారి ప్రాణం తీసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మరో ఘటనతో.. దాదాపు చిన్నారి ప్రాణం పోయినంత పనైంది. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా.. బాలుడు ఆరుబయట ఉన్న ఓ ఇత్తడి పాత్రలోకి దిగాడు. పైకి లేచేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెండేళ్ల బాలుడు ఇత్తడి పాత్రలోకి దిగాడు. బాలుడి తల మాత్రం పైనే ఉండగా.. శరీరం మొత్తం ఆ పాత్రలో ఇరుక్కుపోయింది. బయటకు వచ్చేందుకు వీలు కాకపోవడంతో బాలుడు ఏడవడం మొదలుపెట్టాడు. ఏమైందా అని తల్లిదండ్రులు చూసేసరికి ఇత్తడిపాత్రలో ఇరుక్కుపోయి కనిపించాడు. వెంటనే బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా బాలుడిని బయటకు తీయడం సాధ్యపడలేదు. దాంతో ఆ పాత్రతో పాటు బాలుడిని వెల్డింగ్ షాపుకి తీసుకెళ్లారు. అక్కడ గంట సమయం శ్రమించి పాత్రను జాగ్రత్తగా కట్ చేసి.. బాలుడిని బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.