Vegetable prices: ఠారెత్తిస్తున్న టమాటా.. ఘాటెక్కిన ఉల్లి ధరలు.. హోటల్స్ లో ఆనియన్ సలాడ్ కు నో?
కూరగాయల ధరలు పెరిగిపోయాయి. టమాటా ధర వంద రూపాయలకు చేరువలో ఉంది. కిలో ఉల్లి ధర యాభై రూపాయలు పలుకుతుంది.;
కూరగాయల ధరలు పెరిగిపోయాయి. టమాటా ధర వంద రూపాయలకు చేరువలో ఉంది. కిలో ఉల్లి ధర యాభై రూపాయలు పలుకుతుంది. నిన్నటి వరకూ ఇరవై రూపాయలు పలుకుతున్న టమాటా ఒక్కసారిగా ఎనభై వేల రూపాయలకు పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని కూరగాయల ధరలు పెరిగిపోయాయి. మొన్నటి వరకూ తక్కువగానే దొరికే కూరగాయలు ఒక్కసారిగా పెరగడం ఉత్పత్తి తగ్గడమేనని వ్యాపారులు చెబుతున్నారు. అకాల వర్షాలకు పంటలు చేతికి రాకపోవడంతో దిగుమతులు తక్కువగా రావడంతో ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు తగ్గాల్సి ఉండగా...
సాధారణంగా వేసవిలో కూరగాయలు ధరలు పెరుగుతాయి. వర్షాకాలంలో తగ్గుతాయి. కానీ వర్షాకాలం మొదలయినప్పటికీ కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కేవలం పక్షం రోజుల్లోనే కూరగాయల ధరలు అరవై శాతం ధరలు పెరిగాయని వ్యాపారాలు సయితం చెబుతుండటం విశేషం. ఇక ఆకు కూరల ధరలు కూడా పెరిగిపోయాయి. మొన్నటి వరకూ పది రూపాయలకు మూడు కట్టలు ఇచ్చే ఆకు కూరలు ఇప్పుడు ఒక కట్ట మాత్రమే వస్తుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని కొనలేక.. కొనకుండా ఉండలేక సామాన్యులు అవస్థలు పడుతున్నారు.
దిగుమతులు తగ్గి...
పంట దిగుబడి సక్రమంగా రాకపోవడం వల్లనే ఈ ధరలు ఒక్కసారిగా పెరిగాయంటున్నారు. ఉల్లి ధర మొన్నటి వరకూ కిలో ఇరవై రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు కిలో యాభై రూపాయలకు చేరుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉల్లి దిగుమతులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ కు ప్రతి రోజూ ఎనిమిది వేల క్వింటాళ్లు అవసరం కాగా, ఇప్పుడు ఐదు వేల క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో హోటల్స్ లోనూ ఉల్లి పాయలు అడిగితే నో అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆనియన్ సలాడ్ లేదని ఇప్పటికే హైదరాబాద్ లోని అనేక ప్రముఖ హోటళ్లలో బోర్డు పెట్టడం చూస్తుంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలకు అవసరమైన ఉల్లిలో సగానికి సగం మాత్రమే అందుబాటులో ఉంది.