BJP : తెలంగాణలో బీజేపీకి రూట్ మ్యాప్ లేదు...క్షేత్రస్థాయిలో పోరాటం లేదుగా

తెలంగాణలో బీజేపీ ఇప్పుడు చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Update: 2024-08-26 12:19 GMT

తెలంగాణలో బీజేపీ ఇప్పుడు చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోరు జరుగుతుండటంతో భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు జనంలోకి వెళుతున్నాయి. కానీ బీజేపీకి మాత్రం ఎలాంటి అజెండా లేకుండా పోయింది. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ప్రజల్లోకి వెళుతూ పార్టీలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు హడావిడిచేస్తున్నాయి. కానీ బీజేపీకి మాత్రం ఏం చేయాలన్న దానిపై ఒక స్పష‌్టత లేదు. స్థానికసంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ నేతలు ఇలా వ్యవహరిస్తుండటం కొంత క్యాడర్ ను అయోమయంలోకి నెడుతుంది.

అజెండా దొరకక...
రుణమాఫీ అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రైతులకు ఇచ్చిన మాట మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. విడతల వారీగా మూడు సార్లు రుణమాఫీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు పదిహేనో తేదీలోపు కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేసింది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం రుణమాఫీ పూర్తిగా జరగలేదంటూ నియోజకవర్గాల స్థాయిలో ఆందోళనలకు దిగింది. గత ఎన్నికల్లో గ్రామాల్లో పట్టుకోల్పోయిన కారు పార్టీ రైతుల మద్దతుతో మళ్లీ బలం పెంచుకోవాలని చూస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దయెత్తున సభను పెట్టి రాహుల్ ను పిలిచి రుణమాఫీపై వివరణ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది.
ఆ రెండు పార్టీలూ...
ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ లు పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఇటు హస్తం పార్టీ అటు కారు పార్టీ అడుగులు వేస్తుండగా కమలం పార్టీ మాత్రం ఎలా వెళ్లాలన్న దానిపై రూట్ మ్యాప్ దొరకడం లేదు. మీడియా సమావేశాలకు తప్ప క్షేత్రస్థాయిలో ఆందోళనలకు అది దిగడం లేదు. కేంద్రంలో అధికారంలోకి మూడో సారి వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్న బీజేపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కార్యకర్తలు దిక్కులు చూస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలో వారికే క్లారిటీ లేదు. దీంతో పాటు నాయకత్వంలో ఇబ్బందులు కూడా పార్టీని ఈ పరిస్థితిని తెచ్చి పెట్టాయి.
ఇద్దరు మంత్రులున్నా...
తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు. అయినా ఫలితం లేదు. ఎవరిది వారే యమునా తీరే అన్న చందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా తెలంగాణ గురించి పట్టించుకోవడమే మానేసినట్లు తెలిసింది. కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందని గతకొద్దికాలంగా జరుగుతున్న ప్రచారం కార్యరూపం దాల్చలేదు. హైడ్రా కూల్చివేతలపై కూడా నేతల మధ్య కో-ఆర్డినేషన్ లేకపోవడంతో నవ్వుల పాలవుతున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ హైడ్రా కూల్చివేతలను తప్పుపడితే, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమర్థించడం చూస్తుంటే సమన్వయం నేతల మధ్య ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Tags:    

Similar News