సంక్షోభం.. కుమారుడు, సతీమణి పాత్ర ఎంతంటే?
శివసేన ప్రభుత్వం సంక్షోభంలో పడటానికి ఆదిత్య థాక్రే , ఉద్ధవ్ సతీమణి రశ్మి థాక్రే కూడా కారణమని చెప్పకతప్పదు;
ఆదిత్య థాక్రే .. శివసేన యువనేత. ఉద్ధవ్ థాక్రే వారసుడు. ప్రస్తుత ప్రభుత్వం మొత్తం సంక్షోభంలో పడటానికి ఆదిత్య థాక్రే కారణమని చెప్పక తప్పదు. ఆయనతో పాటు ఉద్ధవ్ సతీమణి రశ్మి థాక్రే కూడా శివసేన నిట్టనిలువుగా చీలడానికి ప్రధాన కారణమంటున్నారు. తల్లి,కొడుకుల కారణంగా పార్టీ చీలిపోయి ఇప్పుడు ప్రభుత్వం పతనానికి దారితీసింది. ప్రభుత్వ వ్యవహారాల్లో ఇద్దరూ జోక్యం చేసుకున్న కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు.
మాతృశ్రీ నుంచి.....
మాతృశ్రీ నుంచే ఆదేశాలు అధికారులకు చేరుతుంటాయని, శివసేన మంత్రులను, ఎమ్మెల్యేలను పూచిక పుల్లతో సమానంగా వీరు చూడటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. శివసేనలో ఏక్‌నాధ్ షిండే వ్యవస్థాపక సభ్యుడిగా కొనసాగుతున్నారు. బాల్ థాక్రే హయాం నుంచి ఆయనకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలసి పోటీ చేశాయి. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన పట్టుబట్టింది. దీని వెనక ఆదిత్య, రశ్మి థాక్రే ఉన్నారు. బీజేపీ కాదనడంతో శివసేన కొన్ని దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్న ఎన్సీపీ, కాంగ్రెస్ కు దగ్గరయింది. ఆ రెండు పార్టీల మద్దతుతో ఉద్ధవ్ ముఖ్యమంత్రి కాగలిగారు.
తాత సిద్ధాంతాలకు విరుద్ధంగా....
అసలు శివసేన చీఫ్ కుటుంబం నుంచి ఎవరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగలేదు. బాల్ థాక్రే బతికి ఉన్నంత వరకూ అది జరగలేదు. అధికారం కోసం కాకుండా హిందుత్వ కోసమే ఆయన ఆరాటపడ్డారు. పోరాటం చేశారు. కానీ ఆయన మరణం తర్వాత ఉద్ధవ్ థాక్రే కుటుంబం నుంచి ఆదిత్య థాక్రేను నేరుగా ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి దించింది. వర్లి నుంచి పోటీ చేయించింది. ఆయన గెలుపునకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం కూడా తీసుకుంది. ఇదంతా శివసైనికులకు కొంత ఇబ్బందిగా మారింది. అధికారంలోకి రాగానే మంత్రి పదవి లోకి కూడా ఆదిత్య థాక్రేను తీసుకుంది. ఇది ఎమ్మెల్యేల్లో మరింత బ్యాడ్ అయింది.
ఎన్సీపీ ఆడించినట్లు....
అయితే ఈ కలయికను తొలి నుంచి శివసేనలో కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ వ్యతిరేకంగా ఎవరూ గళం విప్పలేకపోయారు. గడచిన రెండు సంవత్సరాల నుంచి ఉద్ధవ్ థాక్రే పరిస్థితి మారిపోయింది. ఆయన ప్రజలకు దూరమయ్యారు. ఎన్సీపీ చేతిలో బందీ అయ్యారన్న విమర్శలున్నాయి. దీనికి కారణం కూడా ఆదిత్య, రశ్మి థాక్రే అన్నది వాస్తవం. ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ఆ రెండు పార్టీల సహకారం అవసరమని భావించి ఎన్సీపీ ఆడించినట్లు థాక్రే కుటుంబం ఆడిందంటున్నారు. శివసేన ఎమ్మెల్యేలను అస్సలు పట్టించుకోలేదు. వారి నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఆలోచించలేదు. అందువల్లనే ఇంత పెద్ద స్థాయిలో శివసేన ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత వచ్చిందంటున్నారు.
షిండే అదను చూసి.....
ఇక శివసేనలో ముఖ్యనేత ఏక్‌నాథ్ షిండే పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్నారు. ఆయన శాఖలో కూడా ఆదిత్య వేలు పెట్టారు. ఆయన చెబితేనే అధికారులు జీవోలు విడుదల చేస్తున్నారు. ఇవన్నీ కొంతకాలం నుంచి భరిస్తూ వచ్చిన షిండే అదనుకోసం వెయిట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కలసి వచ్చాయి. అప్పటికే శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలను ఏక్‌నాధ్ షిండే పసిగట్టారు. తనతో నమ్మకంగా వచ్చే వారిని నిర్ధారించుకున్నారు. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. అనంతరం క్యాంప్ నకు బయలుదేరారు. క్యాంప్ నుంచే థాక్రే కుటుంబానికి సవాల్ విసిరారు. సక్సెస్ అయ్యారు. 34 మంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకుని వెళ్లడమంటే శివసేన అధినేత కుటుంబంపై ఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థమవుతుంది.