ప్లీనరీ తర్వాత నుంచి ఇక దబిడి దిబిడే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జులై నెల నుంచి పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జులై నెల నుంచి పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి జూన్ 8వ తేదీతో మూడేళ్లు పూర్తి కానుంది. ఈ సందర్బంగా పెద్దయెత్తున ప్లీనరీని వైసీపీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్లీనరీ నుంచే జగన్ పార్టీ వ్యవహారాలను పూర్తిగా పట్టించుకోనున్నారు. ఈ మూడేళ్ల నుంచి జగన్ పార్టీ వ్యవహారాలను పట్టించుకోలేదు. కేవలం పాలన, సంక్షేమ పథకాల అమలుపైనే జగన్ దృష్టి పెట్టారు.
ఎన్నికలకు ఇంకా...
అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో వచ్చే జూన్ నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జగన్ ప్రయత్నించనున్నారు. ప్లీనరీ తర్వాత నుంచి జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. ప్రతి శని, ఆదివారాలు ఈ సమీక్షలు ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తుంది. నేతల మధ్య సమన్వయం లేదు. ఐక్యత లేదు. నామినేటెడ్ పోస్టులను భారీగా భర్తీ చేసినా ఇంకా విభేదాలు సమసి పోలేదు.
పీకే టీంను...
జగన్ ఇప్పటికే వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రశాంత్ కిషోర్ టీంను రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయనే మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. ప్లీనరీ తర్వాత నుంచి ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగి నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నించనున్నారు.
ఎమ్మెల్యేల పనితీరును....
ఎమ్మెల్యేల పనితీరును కూడా ఈ సందర్భంగా పరిశీలించనున్నారు. కొందరు ఎమ్మెల్యేలు గత మూడేళ్లుగా వ్యాపారాలపై దృష్టి పెట్టి నియోజకవర్గాలను విస్మరించారు. ఈ నేపథ్యంలో వారికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి, మార్పు రాకపోతే కఠిన నిర్ణయం తీసుకోవాలని కూడా జగన్ భావిస్తున్నారు. వచ్చే జూన్ నాటి నుంచి పార్టీపైన దృష్టి పెట్టడంతో పాటు ముఖ్యమంత్రిగా జిల్లాల పర్యటనలు కూడా చేయాలని జగన్ నిర్ణయించారు. ప్లీనరీ నుంచి పూర్తిగా రాజకీయ వ్యవహారాలపైనే జగన్ కాన్సన్‌ట్రేట్ చేయనున్నారు.