SlBC Accident : టన్నెల్ లో కనీసం అవశేషాలయినా దొరుకుతాయా? లేదా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతదేహాల ఆచూకీ తెలియలేదు;

శైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతదేహాల ఆచూకీ తెలియలేదు. దీంతో టన్నెల్ లోతప్పిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదం జరిగి నెల రోజులు దాటుతున్నప్పటికీ ఇప్పటికీ మృతదేహాల ఆచూకీ మాత్రం లభించకపోవడం పై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లు ఇలా పడిగాపులు కాయాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు శ్రీశైలం టన్నెల్ లో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. దాదాపు పన్నెండు బృందాలు నిరంతరం టన్నెల్ లో సహాయక చర్యలు చేపడుతున్నా ఎటువంటి ఫలితం కనిపించడం లేదు.
నేడు రేవంత్ సమీక్ష...
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీశైలం టన్నెల్ ప్రమాదంపై సమీక్ష చేయనున్నారు. టన్నెల్ లో తాజా పరిస్థితిని ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ఉన్నతాధికారులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించనున్నారు. ఇప్పటి వరకూ టీబీఎం మిషన్ తొలగింపు, బురదను తవ్వకం పూర్తి కాకపోవడంతో మృతదేహాలు ఉంటాయని భావిస్తున్న ప్రాంతంలో తవ్వకాలు సాధ్యపడటం లేదు. రోబోలను పెట్టి తవ్వకాలు జరిపినా సాధ్యం కాకపోవడంతో ఇక కార్మికుల చేత తవ్వకాలు జరిపించాలని ఉన్నతాధికారులు భావించినా అది ప్రమాదకరంగా ఉండటంతో కొంత వెనుకంజ వేస్తున్నారు.
బంధువులకు అప్పగించాలని...
ఏడుగురు మృతదేహాలు ఇక లభ్యమయ్యే అవకాశాలు లేవు. కనీసం అవశేషాలు అయినా బంధువులకు అప్పగించాలన్న ఉద్దేశ్యంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు ఉన్నతాధికారుల తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందాల సహకారం తీసుకుంటామని, అవశేషాలు లభ్యమయ్యేంత వరకూ సహాయక చర్యలు కొనసాగించడం తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మరోవైపు రేవంత్ రెడ్డి నేడు తీసుకునే నిర్ణయంపై సహాయక చర్యలు కొనసాగింపుపై ఒక స్పష్టత వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాకపోవడంతో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.