కమ్మ వారిలో కసి పెరుగుతుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కమ్మ సామాజికవర్గం ఆగ్రహం రోజురోజుకూ ఎక్కువవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కమ్మ సామాజికవర్గం ఆగ్రహం రోజురోజుకూ ఎక్కువవుతుంది. గత ఎన్నికల్లో తాము చంద్రబాబును కాదని జగన్ కు మద్దతిచ్చినా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమను అణగదొక్కు ప్రయత్నం చేస్తున్నారని కమ్మ సామాజికవర్గం అభిప్రాయపడుతుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కమ్మలనే టార్గెట్ చేశారని, వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నది వారు డిసైడ్ అయ్యారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత...
పదవుల పంపకాల్లోనూ కమ్మ కలానికి జగన్ అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తొలి నుంచి వైసీపీనే నమ్ముకుని ఉన్న మర్రి రాజశేఖర్ కు అన్యాయం జరిగిందన్నది కోస్తాంధ్ర కమ్మ సామాజికవర్గంలో విన్పిస్తున్న మాట. ఇటీవల ఇద్దరు కమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా మర్రి రాజశేఖర్ ను కావాలనే జగన్ తొక్కి పెట్టారని, భవిష్యత్ లో కూడా ఇక ఏ పదవులు ఇచ్చే అవకాశం లేదన్నది వారు డిసైడ్ అయ్యారు. రాజశేఖర్ నేరుగా బయటపడకపోయినా ఆయన వర్గం మాత్రం వైసీపీకి దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.
మర్రి బామర్ది....
మర్రి రాజశేఖర్ బావమరిది వెంకటసుబ్బయ్య వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. జగన్ తనను నమ్ముకుంటే గుండెలపై కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. రోశయ్య సంస్మరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోశయ్య పార్ధీవ దేహాన్ని చూసేందుకు కూడా జగన్ కు తీరికలేదా? అని ఆయన ప్రశ్నించారు. నేరుగా మర్రి రాజశేఖర్ బావమరిది జగన్ పైనే కామెంట్స్ చేయడం కమ్మ కులంలో ఉన్న ఆగ్రహాన్ని బయటపెట్టిందనే చెప్పాలి.
రియల్ రంగంలోనూ...
మరోవైపు ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయం తమను టార్గెట్ చేసేదేనంటున్నారు. ప్రయివేటుగా లే అవుట్ లు వేస్తే ప్రభుత్వానికి ఐదు శాతం భూమిని ఇవ్వాలని ఉత్తర్వులు తేవడం కూడా కమ్మ కులంపై కక్షతోనేనని అంటున్నారు. కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారేనన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద జగన్ పై కమ్మ సామాజికవర్గం ఆగ్రహంగా ఉందనడానికి ఇవే ఉదాహరణలు.