సోము వల్ల ఏమీ కాదా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలో ఉన్నారు. పొత్తులపై హైకమాండ్ నిర్ణయం ప్రకటించే అవకాశముంది;

Update: 2023-04-09 03:32 GMT

బీజేపీలో పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే కీలకమైనా ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతోనే పార్టీ నడుస్తుంది. ప్రధానంగా ఇంతకు ముందులా కాదు. మోదీ, అమిత్ షాల నేతృత్వంలో రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ కారణంగానే అభ్యర్థుల ఎంపిక నుంచి, మ్యానిఫేస్టో, పొత్తులతో పాటు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక కూడా వారి ఇద్దరి కనుసన్నల్లోనే జరుగుందన్నది యదార్ధం. పార్టీ పొలిటి బ్యూరో అన్నది నామమాత్రమే. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు. ఎన్నికలకు ముందు ఆ యా రాష్ట్రాల పరిస్థితులను అనుసరించి పొత్తులపై వారిద్దరే నిర్ణయం తీసుకుంటారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉత్సవ విగ్రహమేనని చెప్పాలి. మోదీ, షాలు చెప్పినట్లు తలాడించడం వల్లనే ఆయనకు రెండోసారి పదవి రెన్యువల్ లభించిందనడంలో అతిశయోక్తి లేదు.

ఫైనల్ డెసిషన్ మాత్రం...
కానీ ముందుగా శంఖంలో తీర్థం పోసిన చందంగా కొంత సంప్రదాయాలను పాటిస్తారు. పార్టీ అధ్యక్షుడితో మాట్లాడటం, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం సాధారణంగా కమలం పార్టీలో జరుగుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజకీయ నిర్ణయాలను కూడా అంతే అనుకోవాలి. అందుకు భిన్నంగా ఉంటుందని చెప్పలేం. సోము వీర్రాజు చెప్పారని టీడీపీతో పొత్తు వద్దనుకోరు. చెప్పలేదని మానుకోరు. ఆ నిర్ణయం వారిద్దరిదే. ఫైనల్ డెసిషన్ వారి నుంచి రావాల్సిందే. కాకుంటే సోమును మూడు రోజులు ఢిల్లీకి పిలిపించి ఒక డ్రామాను సృష్టిస్తారు. ప్రజాస్వామ్యంగా నిర్ణయం తీసుకున్నామంటూ ప్రకటించుకుంటారు. అంతే తప్ప సోము వల్ల ఊడేదేం లేదు. తెగెది ఏమీ లేదు.
పొత్తు పెట్టుకోవాలనుకుంటే...
కాకుంటే ఇక్కడ కొన్ని అనుమానాలు తలెత్తక మానదు. టీడీపీతో పొత్తు కావాలనుకుంటే కన్నా లక్ష్మీనారాయణ వెళుతుంటే ఆపేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మకమైన మిత్రుడు కాదని మోదీ, షాలు ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశాలను అనుసరించే సోము వీర్రాజు కూడా ఇక్కడ పనిచేస్తూ వస్తున్నారు. అంతే తప్ప తాను వ్యక్తిగతంగా చంద్రబాబుకు వ్యతిరేకి కాదు. అలా అని జగన్ ను కూడా సమర్ధించలేదు. పార్టీని ఏపీ బలోపేతం చేయడం, భవిష‌్యత్ లో కాషాయ జెండా ఎగరాలన్న కాంక్షతోనే కేంద్ర నాయకత్వం ఇచ్చిన సూచనలతో సోము టీం పనిచేస్తుందని చెప్పాలి. తాత్కాలిక ప్రయోజనాలను వారు ఆశించి నిర్ణయాలు తీసుకోరు. అందుకే కన్నా వంటి వారు విసిగిపోయి పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పాలి.
ఒపీనియన్ కాదు.. మార్గదర్శనమే...
కాకుంటే ఇక్కడ పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డాను కలసి వచ్చారు. టీడీపీతో పొత్తు ఉంటేనే వైసీపీని ఓడించగలమని చెప్పి వచ్చినట్లు తెలిసింది. ఇక తాజాగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే భావన వ్యక్తీకరించి ఉండి వచ్చు. ఎందుకంటే కిరణ్ కూడా జగన్ వ్యతిరేకి. అందుకే టీడీపీతో సయోధ్యత కొనసాగిస్తే మంచిదని నల్లారి సూచించి ఉండివచ్చు. కానీ ఇది ఊహాగానాలు మాత్రమే. అయితే సోము వీర్రాజుకు ఢిల్లీ పెద్దలు ఎలాంటి డైరెక్షన్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోము అభిప్రాయం తీసుకునే కన్నా, మోదీ, షాల ఒపీనియన్ ప్రకారం ఒక మార్గదర్శనం సోముకు లభించే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.


Tags:    

Similar News