ప్రధానికి జగన్ ప్రత్యేక వినతి
విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు
విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు. భీమవరం పర్యటనకు వచ్చిన ప్రధాని తిరిగి వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన సందర్భంలో జగన్ ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీ త్వరగా కోలుకునేందుకు ప్రత్యేక హోదాను ఇవ్వాలని జగన్ వినతి పత్రంలో కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్ కోకు రావాల్సిన 6,627.28 కోట్లను ఇప్పించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం 55,548.87 కోట్లకు ఆమోదం పొందేలా చూడాలని జగన్ ప్రధానిని అభ్యర్థించారు.
హోదా విషయంలో....
రీసోర్స్ గ్యాప్ గ్రాంట్ కింద 34,125.5 కోట్ల రూపాయలను ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందజేయాలని జగన్ కోరారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సంబంధించి క్లియరెన్స్ లు మంజూరు చేయాలని కోరారు. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని, జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఇస్తున్న రేషన్ విషయంలో చట్టబద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, దీనిని సవరించాలని జగన్ తాను ప్రధాని మోదీకి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.