బీజేపీకి ఝలక్.. కేసీఆర్ ఫోన్లతో క్యూ కడుతున్న నేతలు
మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ లో భారీగా చేరికలు ఉండనున్నాయి. స్వామిగౌడ్ కు కేసీఆర్ ఫోన్ చేసినట్లు సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ లో భారీగా చేరికలు ఉండనున్నాయి. కొద్దిసేపటి క్రితం స్వామిగౌడ్ కు స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలిసింది. దీంతో స్వామిగౌడ్ కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ సమక్షంలో తిరిగి వారు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారని తెలిసింది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిని స్వామి గౌడ్ తిరిగి టీఆర్ఎస్ కు దగ్గరవుతున్నారని చెబుతున్నారు. స్వామిగౌడ్ తో పాటు విఠల్ కూడా టీఆర్ఎస్ లో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ ను కూడా ఇప్పటికే టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.
బీసీ ఓటర్లు...
మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. మునుగోడులో ఉన్న 1,69 వేల బీసీ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు ఉద్యమకారులకు కూడా తిరిగి పార్టీలోకి అవకాశం కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకోసమే గతంలో ఉద్యమంలో తన వెంట నడిచిన నేతలందరికీ స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానిస్తున్నారని తెలిసింది.
ప్రతిష్టాత్మకం కావడంతో...
మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే ఏడాది జరగునున్స సాధారణ ఎన్నికల్లో గెలుపు, బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఆ పార్టీ ఉంది. అయితే బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న మునుగోడులో ఆ నేతలను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ నుంచే వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ఉద్యమకారులను...
వరసగా తనతో పాటు ఉద్యమ సమయంలో పాల్గొన్న నేతలందరికీ ఫోన్లు చేస్తూ తిరిగి చేరాలని ఆహ్వానిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ ను పెంచి అవసరమైతే కొందరి నేతలను బుజ్జగిస్తున్నారు. ప్రధానంగా ఉద్యమకారులు, బీసీ నేతలను పార్టీలోకి చేర్చేకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. దీంతో ఏ పార్టీ నుంచి ఎవరు కండువాను కప్పుకుంటారన్నది తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. కొందరు నేతలను మంత్రి కేటీఆర్ ఆహ్వానిస్తున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక దెబ్బకు టీఆర్ఎస్ లో అనేకమంది నేతలు క్యూ కట్టే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం.