రాజకీయ దురుద్దేశంతో జగన్ ను హత్యచేయడానికే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నామని వైసీపీ నేతలు చెప్పారు. పార్టీ కార్యాలయంలో వైసీపీ కీలక నేతల సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఘటన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రులు మాట్లాడిన తీరు ఆక్షేపణీయంగా ఉన్నాయని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దీనిపై నిజానిజాలు బయటకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారించాలని డిమాండ్ చేశారు. జగన్ పై అమానవీయ ఘటనపై ఐదు కోట్ల మంది ప్రజలు నిర్ఘాంతపోయారన్నారు. దీనిపై రాష్ట్రపతిని, గవర్నర్ ను, కేంద్ర హోంశాఖమంత్రిని త్వరలోనే కలవనున్నామని చెప్పారు. జగన్ కు అయిన గాయం కారణంగా మరికొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుని పాదయాత్ర ప్రారంభించాలని జగన్ ను కోరామన్నారు.
త్వరలోనే కార్యచారణ......
జగన్ ను భౌతికంగా నిర్మూలించాలన్న కుట్ర కోణాన్ని ప్రజలకు వివరించడానికి తదుపరి కార్యాచరణను త్వరలోనే రూపొందించనున్నామన్నారు. దీనిపై ఏపీ పోలీసుల విచారణను వ్యతిరేకించామే తప్ప తెలంగాణ పోలీసుల దర్యాప్తును తాము కోరుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత ఈ ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు. చంద్రబాబు, డీజీపీ డైరెక్షన్ లోనే మొత్తం డ్రామా జరుగుతుందన్నారు. నారా లోకేష్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. జగన్ ను కించపర్చేవిధంగా మాట్లాడేతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాబు, కొడుకులిద్దరినీ ఇంటికి పంపే రోజులు త్వరలోనే వస్తున్నాయన్నారు. చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లడానికి తమపై బురద జల్లడానికేనన్నది అందరికీ తెలిసిందేనన్నారు. ఈ హత్యాప్రయత్నం వెనక చంద్రబాబు ఉన్నారన్నది వాస్తవమన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం చూస్తేనే అర్థమవుతుందన్నారు. ఈ సమావేశంలో నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు పార్థసారథి లు పాల్గొన్నారు.