గులాబీమయంగా ఖమ్మం... ఎల్లుండి సభ

ఎల్లుండి ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరగనుంది. ఈ సభకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు

Update: 2023-01-16 02:49 GMT

ఎల్లుండి ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరగనుంది. ఈ సభకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం పట్టణం హోర్డింగ్ లతో ముంచెత్తారు. ఈ నెల 18వ తేదీన జరగనున్న ఈ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. పలు ప్రాంతీయ పార్టీల నేతలు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. దాదాపు ఐదు లక్షల మందితో బీఆర్ఎస్ సభను నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే నేతలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

జనసమీకరణకు...
ఈ నేపథ్యంలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణల నుంచి పెద్దయెత్తున జనాన్ని తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో కూడా పలు చోట్ల హోర్డింగ్ లను ఏర్పాటు చేశారు. దాదాపు వంద ఎకరాల్లో ఈ సభ ఏర్పాట్లను చేస్తున్నారు. మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిలు సభ ఏర్పాట్ల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి వేలాది మందిని తరలించేందుకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రయివేటు వాహనాలను నేతలు బుక్ చేసుకున్నారు. 400 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
పార్కింగ్ ఏర్పాట్లు...
ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సులువుగా వచ్చి సులువుగా వెళ్లేందుకు వీలుగా ఈ పార్కింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు క్యూ ఆర్ కోడ్ ను వినియోగించాలని నిర్ణయించారు. యాభై ఎల్‌ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేసి పలువురు నేతల ప్రసంగాలను వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో జరిగే ఈ బహిరంగ సభ ద్వారా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు.



Tags:    

Similar News