బుట్టా రేణుక జంప్.. సిగ్నల్ రాగానే?
మొన్న స్థానిక సంస్థల ఎన్నికల వరకూ వైసీపీలో యాక్టివ్ గా ఉన్న బుట్టా రేణుక ఇటీవల సైలెంట్ అయ్యారు.
బుట్టా రేణుక రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అత్యున్నత సభ అయిన పార్లమెంటులో అడుగుపెట్టారు. రాజకీయంగా ఆమె వేసిన తప్పటడుగులు పదవులకు దూరం చేశాయి. అయితే మరోసారి బుట్టా రేణుక తన భవిష్యత్ ను నిర్ణయించుకునేందుకు రెడీ అయ్యారంటున్నారు. వైసీపీలో ఉంటే వచ్చే ఎన్నికలలో టిక్కెట్ రాదని బుట్టా రేణుక భావిస్తున్నారు. అందుకే మరోసారి టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది.
తొలి నుంచి...
బుట్టా రేణుక భర్త తొలి నుంచి టీడీపీ సానుభూతి పరుడు. ఆయనకు టీడీపీ అత్యున్నత స్థాయి నేతలతో సత్సంబంధాలున్నాయి. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తున్నారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక విజయం సాధించారు. వైసీపీ పార్లమెంటు సభ్యురాలిగా సభలో అడుగు పెట్టారు. అయితే వైసీపీ అప్పట్లో అధికారంలోకి రాకపోవడంతో ఆమె భర్త ముందుగానే టీడీపీలో చేరిపోయారు.
వైసీపీలో భవిష్యత్ లేదని....
తర్వాత బుట్టా రేణుక కూడా టీడీపీ మద్దతుదారుగా మారిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో బుట్టారేణుక ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిపోయారు. కానీ వైసీపీలో ఆమెకు ఎలాంటి పదవులు దక్కలేదు. కనీసం ఎమ్మెల్సీ స్థానాన్ని అయినా ఇస్తారని బుట్టా రేణుక భావించారు. కానీ ఒకసారి చీట్ చేసి వెళ్లి వారికి జగన్ పదవులు ఇవ్వరని పార్టీ అగ్రనేత ఒకరు చెప్పడంతో బుట్టా రేణుక పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు.
మంతనాలు షురూ...
మొన్న స్థానిక సంస్థల ఎన్నికల వరకూ వైసీపీలో యాక్టివ్ గా ఉన్న బుట్టా రేణుక ఇటీవల సైలెంట్ అయ్యారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో అయితే ఎంపీగా కాని, లేదా ఎమ్మెల్యేగా గాని అవకాశం లభిస్తుందన్న అంచనాలో ఉన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఈసారి ఎంపీ సీటును ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేరు. అలాగే ఎమ్మిగనూరు స్థానాన్ని కూడా మార్చాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండింటిలో ఒకటి తనకు దక్కుతుందన్న ఆశతో బుట్టా రేణుకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. స్పష్టమైన హామీ లభిస్తే జంప్ చేయడానికి రేణుక రెడీగా ఉన్నారు.