యాత్ర ఆ ఒక్కటిని మాత్రం సాధిస్తుందట
అమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. వారు పాదయాత్ర ప్రారంభించి నేటికి 38 రోజులవుతుంది
అమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. వారు పాదయాత్ర ప్రారంభించి నేటికి 38 రోజులవుతుంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ వారు న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర చేస్తున్నారు. అయితే దీని కి తెలుగుదేశం పార్టీ నేతలు సహకరిస్తున్నారు. పాదయాత్ర కేవలం నాలుగు జిల్లాలకే పరిమితం కావడంతో ఆ జిల్లా నేతలకు టీడీపీ అధినాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
టీడీపీ నేతల హడావిడితో...
పాదయాత్ర చేస్తున్న నేతలకు భారీ ఎత్తున స్వాగతం పలకడం, స్థానిక క్యాడర్ చేత వారి యాత్రలో పాల్గొనేలా చేయడం జిల్లాలోని టీడీపీ నేతల విధి. పార్టీ ఎమ్మెల్యేలు సయితం ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లాకు చేరుకోనుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను వైసీపీ ప్రభుత్వం తెరమీదకు తెచ్చిన నాటి నుంచి రాజధాని రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
పట్టించుకోకపోయినా...
కానీ వైసీపీ ప్రభుత్వం వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించేందుకు కూడా సిద్ధపడలేదు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నా వారి శిబిరాల వద్దకు ఒక్క మంత్రి కూడా రాలేదు. మరి పాదయాత్ర చేస్తే ప్రభుత్వం దిగి వస్తుందా? అది జరగని పని. ఎందుకంటే ప్రభుత్వం వీరి ఆందోళనలను ఏడాదిన్నరగా పట్టించుకోలేదు. కానీ మూడు రాజధానుల చట్టాన్ని ఇటీవల వెనక్కు తీసుకున్నా అది తాత్కాలికమేనని తెలుసు. మరో కొత్త బిల్లుతో ముందుకు వస్తారు కాని, జగన్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించరు. అది వాస్తవం.
అన్నీ తెలిసినా...?
పాదయాత్రతో జగన్ దిగిరాడని రాజధాని ప్రాంత రైతులకు తెలుసు. టీడీపీకి అంతకంటే బాగా తెలుసు. కానీ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు, తమపై సానుభూతి వచ్చేందుకు, టీడీపీకి రాజకీయం అనుకూలంగా మారేందుకు ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందన్నది మాత్రం వాస్తవం. రాజధాని ఇక్కడే ఉంటుందో లేదో? తెలియదు కాని, టీడీపీకి ఈ నాలుగు జిల్లాల్లో రాజకీయంగా ఎంతో కొంత రాజకీయంగా లబ్ది చేకూరుతుందన్నది మాత్రం వాస్తవం.
సీమ ప్రాంత నేతలు..
మరో వైపు రాయలసీమ నేతలు అమరావతి రైతుల పాదయాత్రను వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగేలా యాత్ర సాగుతుందని వారు ఆరోపిస్తున్నారు. వారు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో తలపెట్టిన బహిరంగ సభకు కూడా అనుమతి ఇవ్వవద్దని వారు కోరారు. దీంతో ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. మొత్తం మీద మహాపాదయాత్ర ముగింపు దశకు చేరుకున్న సమయంలో రాయలసీమ నినాదం ఇబ్బందికరంగా మారింది. చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుండటతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.