విజయశాంతి ఎక్కడున్నా అంతేనా?
బీజేపీలో విజయశాంతికి కేంద్ర నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ రాష్ట్ర నాయకత్వం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు
విజయశాంతి బీజేపీలో కంఫర్ట్ గానే ఉన్నారా? అంటే ఏమో చెప్పలేని పరిస్థితి. బీజేపీలో ఆమెకు కేంద్ర నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ రాష్ట్ర నాయకత్వం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపినప్పటికీ కొన్నింటికి విజయశాంతి గైర్హాజరవుతుండటంతో పార్టీ నేతలు కూడా ఆమెను లైట్ గా తీసుకుంటున్నారు. విజయశాంతి ఏ పార్టీలో ఉన్నా అంతేనన్న కామెంట్స్ నేతల నుంచి వినపడుతున్నాయి.
కాంగ్రెస్ లో.....
విజయశాంతి మొన్నటి వరకూ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆమె కాంగ్రెస్ లో ఉన్నన్ని రోజులూ గాంధీ భవన్ కు వచ్చింది అరుదు అనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే గాంధీ భవన్ కు రాలేదనే చెప్పాలి. కాంగ్రెస్ లో విజయశాంతికి ప్రధాన బాధ్యతలను అప్పగించినా ఆమె దానిని పెద్దగా పట్టించుకోలేదు. సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరడంతో రాష్ట్ర నేతలను విజయశాంతి లెక్క చేయకపోవడమే కారణమని చెప్పాలి.
బీజేపీలో చేరినా....
తర్వాత విజయశాంతి కాంగ్రెస్ లో ఉండలేక తిరిగి బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో ఆమె చేరిన నాటి నుంచి యాక్టివ్ గానే ఉంటున్నారు. నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయశాంతి బీజేపీ తరుపున ప్రచారం చేశారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరవుతున్నా కొన్ని సార్లు ఆమె కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యక్రమాలకు ఆహ్వానిస్తే తప్ప రావడం లేదు. రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ వస్తే తప్ప ఆమె కార్యాలయానికి రావడం లేదు.
నేతలకు దూరంగా....
దీంతో మిగిలిన నేతలు విజయశాంతి తాము పిలిచినా రారని భావించి ఆహ్వానాలు కూడా పంపడం లేదట. విజయశాంతి తొలి నుంచి తనకు తాను గుర్తింపును కోరుకుంటారు. తనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తారు. అలా లేని చోట ఆమె ఉండలేరు. అందుకే ఆమె ఏడేళ్లలోనే ఇన్ని పార్టీలు మారారు. ఇప్పుడు బీజేపీలో కూడా విజయశాంతి తనకంటే డీకే అరుణకు ప్రాధాన్యత దక్కడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే ఆమె కొంత పార్టీ నేతలతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని బండి సంజయ్ దృష్టికి కొందరు నేతలు తీసుకెళ్లినట్లు తెలిసింది.