నిస్సహాయతే కన్నీరు పెట్టించిందా?

చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Update: 2021-11-19 13:34 GMT

నిస్సాహయత నుంచే కన్నీరు ఉబుకొస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే ఏడుపు తన్నుకు వస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి అంతే. నిజానికి అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు కుటుంబీకుల పేరెత్తి ఎవరూ ఏమీ అనలేదు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ఎప్పుడూ అనేదే కొడాలి నాని వంటి వారు అన్నారు. కానీ చంద్రబాబు ఓవర్ రియాక్ట్ కావడానికి కారణాలేంటి? అన్నది ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

ఫ్రస్టేషన్ తో....
చంద్రబాబు ఫ్రస్టేషన్ లో ఉన్నారన్నది వాస్తవం. గత కొద్ది రోజులుగా జగన్ ను ఫేక్ ముఖ్యమంత్రి అని, రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాయతీ అంటూ రెచ్చగొట్టింది టీడీపీ నేతలే. చివరకు బోస్ డీకే అనే పదాన్ని కూడా జగన్ మీద ప్రయోగించారు. ఆ పదంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగారు. దీంతో బోస్ డీకే పదం తప్పు అని చంద్రబాబు టీడీపీ నేతలకు చెప్పకుండా 36 గంటల దీక్షకు దిగారు. దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
గతంలో జగన్ కు ప్రశ్న....
ఇక నిన్న గాక మొన్న కుప్పం మున్సిపాలిటీని కోల్పోవాల్సి వచ్చింది. చంద్రబాబు కుప్పంలో ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ఇక గతంలో జగన్ అసెంబ్లీని బహిష్కరించిప్పుడు ప్రభుత్వం నుంచి వేతనాలు ఎందుకు తీసుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పుడు అదే ప్రశ్న కొన్ని రోజుల తర్వాతయినా వైసీపీ నేతల నుంచి వస్తుంది. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అసలు జగన్ ను ముఖ్యమంత్రిగా చూసేందుకే చంద్రబాబు తొలి నుంచి ఇష్టపడటం లేదు.
ఇద్దరూ కలుసుకునేది....
వాస్తవానికి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ముఖాముఖి కలుసుకునేది శాసనసభ సమావేశాల్లోనే. ఇక ఫేస్ టు ఫేస్ ఇద్దరూ చూసుకునే అవకాశాలు, సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. నాడు జగన్ తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు తీసుకెళితే ఆయన ముఖం చూడటం ఇష్టం లేక సభను బహిష్కరించి వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన వయసుకు తగిన గౌరవం దక్కడం లేదని, కుటుంబ సభ్యులను సభలోకి లాగుతున్నారని ఆరోపిస్తూ బహిష్కరించి వెళ్లిపోయారు.
బహిష్కరణలతో....
ఇటీవల చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక శాసనసభలో ప్రతిపక్షం ఉండదు. జగన్ కు ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే. జగన్ ను ఏమీ చేయలేని నిస్సహాయత నుంచే చంద్రబాబులో ఏడుపుకు తన్నుకొచ్చింది. అందుకే సాధారణ ఎన్నికల వరకూ చంద్రబాబు ఈ అంశాన్నే ప్రజల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. చంద్రబాబు కన్నీటి శపథం ఫలితస్తుందా? 72 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబుకు సానుభూతి లభిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News