బాబు ఎత్తుగడ అదే.. జనంలోకి వెళ్లాలంటే?
చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆయన రాష్ట్రానికి సేవలందించారు.
చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆయన రాష్ట్రానికి సేవలందించారు. ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారు. ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. ఇక చంద్రబాబు వ్యూహమేంటి? ఆయన రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? శాసనసభకు రాకుండా ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్లనున్నారు అన్నది చర్చనీయాంశమైంది.
గతంలో చేపట్టిన....
చంద్రబాబుకు 72 ఏళ్ల వయసు. 2024 ఎన్నికలు ఆయనకు కీలకం. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే పార్టీకి, తనకు భవిష్యత్ ఉంటుంది. అందుకే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నదే ఆయన నిర్ణయం. అయితే ప్రజల్లోకి చంద్రబాబు ఎలా వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మీకోసం పేరుతో పాదయాత్రను చేపట్టారు. అప్పట్లో మొత్తం 2,340 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు.
మరోసారి పాదయాత్ర...?
మరోసారి పాదయాత్ర చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. ఈసారి తిరుపతి నుంచి మొదలు పెట్టి ఇచ్చాపురం వరకూ పాదయాత్ర చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. పార్టీ మరోసారి విజయం సాధించాలంటే పాదయాత్రకు మించిన ఆయుధం మరొకటి ఆయన వద్ద లేదు. తన కుటుంబ సభ్యులను కించపర్చారంటూ అసెంబ్లీని వీడి బయటకు వచ్చిన చంద్రబాబు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటారని చెప్పారు.
ఎన్నికలకు....
అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఇప్పుడే పాదయాత్ర ప్రారంభించడమా? లేక ఎన్నికలకు రెండేళ్లు ముందు చేయడమా? అన్నది ఆయన ఇంకా నిర్ణయించలేదు. పాదయాత్రకు వయసు సహకరిస్తుందా? లేదా? అన్నది కూడా వైద్యుల సలహాలు తీసుకోనున్నారు. పాదయాత్రతోనే జనం వద్దకు వెళ్లాలన్నది చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అది ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసేలా ఈసారి పాదయాత్ర చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.