చంద్రబాబు అలా వెళితే.. ఇక అసెంబ్లీకి రానట్లే
చంద్రబాబు అధికారానికి రావాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే శాసనసభలోకి అడుగు పెడతారు.
చంద్రబాబు అధికారానికి రావాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే శాసనసభలోకి అడుగు పెడతారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు ఆయనను సీఎం చేస్తామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. "విల్ బాబు బ్రింగ్ బ్యాక్" అంటూ కంకణాలు కట్టుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆర్కే వీకెండ్ పాయింట్ లో అర్ధం కానిది ఒకటే. చంద్రబాబు ఏడ్చిన వెంటనే రాధాకృష్ణ ఆయనకు ఫోన్ చేశారట. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు ఇలా బోరున ఏడవడానికి కారణాలేంటన్న దానిపై ప్రశ్నించారట.
ఇలా అన్నారట....
అప్పుడు చంద్రబాబు "అధికారంలో ఉండాలనుకున్నది ప్రజలకు ఏదో చేద్దామనే గాని.. నాకోసం, నా కుటుంబం కోసం కాదు. నా భార్యను అంత దారుణంగా అవమానించడాన్ని తట్టుకోలేకపోయాను. ఏ ప్రజల కోసం నేను తపనపడ్డానో ఆ ప్రజలే నన్ను వద్దనుకున్నప్పుడు నేనెందుకు మాటలు పడాలి? గౌరవం కోల్పోవాలి? అందుకే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. వచ్చే ఎన్నికల్లో నేను ప్రజలను ఒకటే అడుగుతాను. మీకు నా అవసరం ఉంది అనుకుంటే గెలిపించుకోండి. వద్దనుకుంటే మీ ఇష్టం" అని అన్నట్లు ఆర్కే తన వీకెండ్ కామెంట్స్ లో రాసుకున్నారు.
అవసరం ఉందనుకుంటేనే....?
ఎవరైనా తన అవసరం ఉందని అనుకుంటే గెలిపించే పరిస్థితి ఉందా? ఇప్పుడు చంద్రబాబు ప్రజల మీద అలిగినట్లా? ప్రభుత్వం మీద కోపపడినట్లా? తాను వద్దనుకుంటే గెలిపించాల్సిన అవసరం లేదట. తన అసవరం ఉందని అనుకుంటేనే గెలిపించాలని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ప్రజలను కోరతారట. ఇలా అయితే అయినట్లే అని టీడీపీలోనే కామెంట్స్ వినపడుతున్నాయి. నాడు ఎన్టీఆర్ ను తనను గద్దె దించేశారని ఊరూరా తిరిగినా ప్రజలు ఆయన వైపు కనీసం చూడలేదు. 1999లో ఎన్టీఆర్ ను పడగొట్టిన చంద్రబాబుకే అధికారాన్ని అప్పగించారు.
అంత సీన్ ఉందా?
అలాంటిది రాష్ట్రానికి చంద్రబాబు అవసరముందని ఐదుకోట్ల మంది ప్రజల్లో ఎంత మంది భావిస్తారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు తాను ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో చెప్పాలి. అనేక హామీలు ఇవ్వాలి. వాటిని ప్రజలు నమ్మాలి. అప్పుడే ప్రజలు చంద్రబాబు వైపు చూస్తారు. అంతేకాని ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని పోలో మంటూ పోలింగ్ బూత్ లకు వచ్చి వేసే పరిస్థితి లేదు. మరి చంద్రబాబు ఆ ఆలోచనలో ఉంటే అది కరెక్ట్ కాదన్నది టీడీపీ నేతల అభిప్రాయం.
మరోరకంగా వెళితేనే....
దానికంటే ఇదే తనక చివరి ఛాన్స్ అంటూ జనంలోకి వెళితే కొంత ఫలితం ఉంటుంది. అంతే తప్ప నా అవసరం ఉంటే ఓట్లేయమంటే ఎవరూ వేయరు. అంత అవసరం ప్రజలకు కూడా ఉండదు. ఎవరొచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఆ పార్టీలు బాగుపడతాయి. ఆ నేతలు బాగుపడతారు. అంతే తప్ప ప్రజలు బాగోగులు చూసుకునే వారెవ్వరూ లేరు. చంద్రబాబయినా? జగన్ అయినా? అందుకే ఇచ్చే హామీలపైన, నమ్మకంపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. రాధాకృష్ణకు చెప్పినట్లుగా చంద్రబాబు తన అసవరం ఉంటేనే ఓట్లేయండి అని అడిగితే మొన్న వచ్చిన 23 సీట్లు కూడా రావడం కష్టమే.