అరెస్ట్ కావడమే చంద్రబాబు లక్ష్యమా..?
రెండు, మూడు రోజుల్లో తనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయవచ్చని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హింట్ ఇచ్చారు. దీని వెనుక కూడా చంద్రబాబు దీర్ఘకాలిక వ్యూహం ఉందని ఆయన్ని ఎరిగిన రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 118 కోట్ల రూపాయలు ‘వెల్లడించని ఆదాయం’పై ఐటీ నుంచి నోటీసు రావడంపై ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రచ్చ చేస్తోంది. ఆ పార్టీలో ఉన్న నాయకులంతా ఐటీ శాఖ నోటీసుల పైనే మాట్లాడుతున్నారు.
జైలుకి వెళ్తే సానుభూతి తథ్యం
ఎన్నికల్లో కావాల్సినంత మైలేజ్
రెండు, మూడు రోజుల్లో తనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయవచ్చని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హింట్ ఇచ్చారు. దీని వెనుక కూడా చంద్రబాబు దీర్ఘకాలిక వ్యూహం ఉందని ఆయన్ని ఎరిగిన రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 118 కోట్ల రూపాయలు ‘వెల్లడించని ఆదాయం’పై ఐటీ నుంచి నోటీసు రావడంపై ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రచ్చ చేస్తోంది. ఆ పార్టీలో ఉన్న నాయకులంతా ఐటీ శాఖ నోటీసుల పైనే మాట్లాడుతున్నారు. ఈ దోపిడీలో లోకేష్ కూడా భాగస్వామేనని, అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం తండ్రీ కొడుకులు వేల కోట్లు దోచుకున్నారని వైకాపా నేతలు, సాక్షి మీడియా కోడై కూస్తున్నాయి. అమరావతి భవనాల నిర్మాణం తరహాలోనే ఫైబర్ గ్రిడ్, ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కుంభకోణాలకు పాల్పడి చంద్రబాబు, ఆయన తనయుడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపిస్తున్నాయి.
ఈ ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. సహజంగానే ఆ పార్టీ అనుకూల మీడియాలో ఐటీ నోటీసులపై ఎలాంటి వార్త కనిపించడం లేదు. రాష్ట్రంలోని తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్న జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఐటీ నోటీసులపై స్పందించకపోవడం గమనార్హం. ఓ మీడియా ప్రతినిధి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఈ విషయమై ప్రశ్నించగా, ఇలాంటి నోటీసులు రావడం పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా మాట్లాడారు. అంటే రాబోయే ఎన్నికల్లో వైకాపా వర్సెస్ రాష్ట్రంలోని ఇతర పార్టీలు అనే విషయం అర్థమైపోతోంది.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో తనను అరెస్ట్ చేయవచ్చని చెప్పారు. రాయలసీమ పర్యటనలో ఉన్న ఆయన రాయదుర్గంలో విద్యావంతులు, లాయర్లతో మాట్లాడారు. వైకాపా రాక్షస పాలన సాగిస్తోందని, పగ సాధింపులో భాగంగా రెండు, మూడు రోజుల్లో తనను అరెస్ట్ చేయవచ్చని తెలిపారు. ఇన్నాళ్లూ నిప్పులా బతికానని, తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను అరెస్ట్ చేయబోతున్నారన్న వ్యాఖ్యలు చంద్రబాబు వ్యూహంలో భాగమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. డెబ్బయ్ మూడేళ్ల వయసులో అరెస్ట్ కావడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందవచ్చనేది ఆయన లక్ష్యంగా చెబుతున్నారు. చంద్రబాబు తలచుకుంటే ముందస్తు బెయిల్ రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అత్యంత సమర్థులతో కూడిన లీగల్ టీమ్ చంద్రబాబు పార్టీ కోసం పనిచేస్తోంది. చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగారు. అరెస్ట్ అయినా తొందర్లోనే బయటకు వచ్చేశారు. కాబట్టి చంద్రబాబు అరెస్ట్ అంత ఈజీ కాకపోవచ్చు. కానీ ఒకసారి అరెస్ట్ అయితే... వచ్చే ఆ సానుభూతి ఆయనకు ఎన్నికల్లో బూస్టర్ డోస్‌గా పని చేస్తుంది. తమ నాయకుడి ‘అక్రమ చెరబాటు’పై ఆ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అది ఎన్నికల ముందస్తు ప్రచారానికి ఉపయోగపడుతుంది. చంద్రబాబుకు కావాల్సినంత మైలేజీ వస్తుంది. జగన్ సర్కార్ ఎన్నికల ముందు చంద్రబాబుకు ‘అంత అవకాశం’ ఇస్తుందా? అనేదే అసలు ప్రశ్న. న్యాయస్థానాల ముందు కంటే ప్రజల ముందే చంద్రబాబును దోషిగా నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబును అరెస్ట్ చేసినందువల్ల వైకాపాకి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉండొచ్చు.