బాబుకు కుప్పం టెన్షన్ వదలడం లేదా?

కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొంత హడావిడి చేసిన చంద్రబాబు ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడం లేదు.

Update: 2021-12-29 04:28 GMT

కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొంత హడావిడి చేసిన చంద్రబాబు ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడం లేదు. కనీసం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి కారకులైన వారిని గుర్తించి వారిపై చర్యలకు కూడా చంద్రబాబు దిగలేకపోతున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేతలపై చర్యలు తీసుకున్న చంద్రబాబు కుప్పం మున్సిపాలిటీ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.

కుప్పంలో ఓటమి....
ఇప్పటికీ కుప్పంలో అదే నాయకత్వాన్ని చంద్రబాబు కొనసాగించడానికి డిసైడ్ అయినట్లే కన్పిస్తుంది. కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు అడ్డాగా మారిపోయింది. ఏడు సార్లు గెలుపు అంటే మాటలు కాదు. కానీ అక్కడ చంద్రబాబు లేకున్నా అంతా సవరించేది అక్కడి నేతలు మాత్రమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చూసుకుంటుండటంతో నియోజకవర్గం బాధ్యతలను ఖచ్చితంగా ఇతరులకు అప్పగించాల్సి వస్తుంది.
వారే ఆధారమా?
చంద్రబాబు తన కుటుంబ సభ్యులను కూడా దూరంగా పెట్టి అక్కడ మునిరత్నం, మనోహర్ లను నియమించుకున్నారు. వారితో కొన్నేళ్లుగా ఎటువంటి సమస్య రాలేదు. కానీ 2019 ఎన్నికల ఫలితాల్లోనే వారి పనితీరు చెప్పకనే చెప్పింది. ఇక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇది స్పష‌్టమయింది. వీరిద్దరిపై స్థానిక క్యాడర్ గుర్రుగా ఉంది. వీరిపై కోపంతోనే కొందరు పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు.
చర్యలేవీ?
కుప్పం మున్సిపల్ ఎన్నికల తర్వాత ఓటమికి గల కారణాలపై చంద్రబాబుకు పూర్తి స్థాయి నివేదిక అందింది. వీరిద్దరి పేర్లే నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు. కానీ చంద్రబాబు మాత్రం వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. వారిద్దరిపైనే కొన్ని దశాబ్దాలు ఆధారపడటంతో పార్టీలో లొసుగులు వారికి తెలిసి ఉంటాయి. అందుకే నెల్లూరు జిల్లా నేతలపై తీసుకున్న చర్యలు వారిపై తీసుకోవడం లేదంటున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి పరిమితం కావాల్సి ఉంటుందన్న కామెంట్స్ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.


Tags:    

Similar News