వైసీపీ అలర్ట్ : నెల్లూరు ఎఫెక్ట్
అధికార వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తికి అడ్డుకట్ట వేయడానికి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
అధికార వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తికి అడ్డుకట్ట వేయడానికి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు నేతలు అసమ్మతి గళం విప్పడంతో పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నియోజకవర్గాల విభేదాలు పార్టీ కొంపముంచే ప్రమాదం ఉందని గ్రహించిన అధినాయకత్వం అలర్ట్ అయింది. అందుకోసమే ఈరోజు ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
రీజనల్ కో ఆర్డినేటర్లతో
పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి 26 జిల్లాల పార్టీల రీజనల్ కో ఆర్డినేటర్లు పాల్గొననున్నారు. ఇప్పటికే వీరందరికీ సమాచారం వెళ్లడంతో అందరూ బయలుదేరి విజయవాడకు చేరుకుంటున్నారు. వీరితో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొంటారని తెలిసింది.
నేతలతో సమావేశం...
ఈ సమావేశంలో అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్ నేరుగా నేతలతో చర్చించనున్నారు. నెల్లూరు ఎపిసోడ్ తర్వాత ఇతర ప్రాంతాలకు ఇది విస్తరించకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు జగన్ నేరుగా సమావేశమై వారితో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల నుంచి నేతలను పిలిచి జగన్ నేరుగా మాట్లాడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.