తమ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో థర్డ్ పార్టీతో నిష్ఫక్షపాతంగా విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్ ను కోరారు. గురువారం వైసీపీ నేతలు గవర్నర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. హత్యాయత్నం కేసులో విచారణ సక్రమంగా జరగడం లేదని, ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు ఢిల్లీలో ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని కోరుతూ పలువురు జాతీయ నేతలను కలిసి మద్దతు కూడగడుతున్నారు.