ఈడీ సోదాల్లో తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఎంపీ సుజనా చౌదరి అక్రమ బాగోతాలు బయటపడుతున్నాయి. సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్యాంకులకు సుమారు రూ.5,700 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు తేలిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. సుజనా గ్రూప్ సంస్థలపై నిన్నటి నుంచి ఈడీ బృందాలు దాడులు చేశాయి. హైదరాబాద్ లోని ఏడు ప్రాంతాలతో పాటు ఢిల్లీలో కూడా సోదాలు జరిగాయి.
అన్నీ డొల్ల కంపెనీలే....
సుజనా గ్రూప్ లో మొత్తం 120 కంపెనీలు ఉండగా వాటిల్లో ఎక్కువ వరకు పనిచేయని కంపెనీలు, కేవలం పేపర్ పై మాత్రమే ఉండే డొల్ల కంపెనీలు ఉన్నట్లు గుర్తించినట్లు ఈడీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సంస్థలకు బ్యాంకులు రూ.5,700 కోట్ల రుణాలు బ్యాంకులు ఇచ్చాయని, పూర్తిగా సుజనా చౌదరి వ్యక్తిగత పూచీకత్తుపైనే రుణాలు మంజూరు అయినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఇవాళ జరిపిన సోదాల్లో పలు కీలక డాక్యమెంట్లను స్వాధీనం చేసుకున్నామని, ఫెరారీ, రేంజ్ రోవర్, బెంజ్ వంటి ఖరీదైన ఆరు కార్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న తమ ముందు విచారణ హాజరుకావాల్సిందిగా సుజనా చౌదరికి ఈడీ నోటీసులు జారీ చేసింది.